భద్రాద్రి సాయం వాకర్స్ ఆధ్వర్యంలో డివి శంకర్రావు కి ఘన సన్మాన కార్యక్రమం

భద్రాచలం TODAY9:
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నెవాడా రాష్ట్రం, రినో నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2026 IPF వరల్డ్ మాస్టర్స్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో భద్రాచలం బిడ్డ, విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి శ్రీ డి.వి. శంకరరావు అద్భుత విజయాన్ని నమోదు చేసి అంతర్జాతీయ వేదికపై మాతృభూమి కీర్తి జెండాను ఎగురవేశారు. అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘సిల్వర్ లెగసీ అట్ గ్రాండ్ సియెర్రా రిసార్ట్’ వేదికగా జరిగిన ఈ పోటీలలో ఆయన మాస్టర్స్-4 (M-4), 74 కిలోల విభాగంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించి, అక్టోబర్ 15న జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని (Bronze Medal) సాధించడమే కాకుండా, కేవలం వారం రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 22న నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ ఎక్విప్డ్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో మెట్టు పైకి ఎదిగి ప్రపంచ రజత పతకాన్ని (Silver Medal) సొంతం చేసుకున్నారు.

ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని భద్రాద్రి సాయం వాకర్స్ సమక్షంలో శ్రీ డి.వి. శంకరరావు గారికి శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి, వారి సాధనకు గుర్తుగా జ్ఞాపికను బహుకరించి అత్యంత వైభవంగా అభినందన సభ నిర్వహించారు. గతంలో గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా అధిగమించి, 73 ఏళ్ల వయోభారంలోనూ పట్టుదలతో కఠోర సాధన చేసి ప్రపంచ వేదికపై రెండు పతకాలు సాధించడం అసాధారణమైన విషయమని, “వయసు విజయానికి అడ్డంకి కాదు, ఆరోగ్య సవాళ్లు ఆశయాలకు అవరోధాలు కావు, అచంచల ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే అసాధ్యానాన్ని సుసాధ్యం చేయవచ్చు” అని శంకరరావు నిరూపించారని వక్తలు కొనియాడారు.

ఈ సన్మాన కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచారి, ప్రముఖులు దుర్గారావు, తుల సూర్యనారాయణ, తుమ్మ చంద్రశేఖరరావు, అనుమల్ల గంగాధరరావు, వెంకటేశ్వరరావు,Lic సత్యనారాయణ, ప్రసాదు, ఆకుల సత్యనారాయణ, పసుపులేటి వెంకట్, కొర్లపాటి రాము, శ్రీనివాసాచారి, మల్లికార్జునరావు, జగ్గా పుల్లయ్య, కె రామలింగేశ్వరరావు, బాలు, రఘురామ్,తదితరులు పాల్గొని శ్రీ డి.వి. శంకరరావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు