యాసంగి పంట వేయొద్దంటున్నారు.. మరి పంటలు సాగు చేయకపోతే రైతులు, రైతు కూలీలకు ఉపాధి ఎలా కల్పిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పంటలు వేయకపోయినా రైతులను ఆదుకునేందుకు రైతుబంధు ఇస్తారా….? సాగు చేయని రైతులకు ఆర్థిక భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని నిలదీశారు. కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా వెంటనే లిఫ్ట్ చేసి సాగుకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యమే ప్రస్తుత దుర్భర పరిస్థితులకు కారణమని ఆరోపించారు. నీటి కొరత, విద్యుత్ సమస్యలపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందని అన్నారు. రైతుల సమస్యలు, సాగునీటి సంక్షోభం, రైతు కుటుంబాల ఉపాధి అంశాలపై అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశామని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల కోసం అవసరమైతే ఢిల్లీలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికైనా వెళ్తామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.









