• మణుగూరులో రక్తసిక్తమైన ప్రయాణం..
• చిల్లర లేదన్నందుకు కండక్టర్‌పై హత్యాప్రయత్నం.!
• రన్నింగ్ బస్సులోంచి మహిళా కండక్టర్‌ను తోసేసిన ప్రయాణికురాలు.
•ఉచిత’ కష్టాలు ప్రాణాల మీదకు.. టైర్ల కింద నలిగిన ఆర్టీసీ కండక్టర్ కాళ్లు.
PAVAN….TODAY 9……
కేవలం తొంభై రూపాయల చిల్లర తగాదా ఓ మహిళా కండక్టర్ జీవితాన్ని చీకట్లోకి నెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ఒకవైపు కలెక్షన్లు లేక, మరోవైపు చేతిలో చిల్లర దొరక్క నిత్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ సిబ్బందిపై అమానుష దాడి జరిగింది. కదులుతున్న బస్సులోంచి విచక్షణారహితంగా కండక్టర్‌ను కిందకు నెట్టేయడంతో బస్సు వెనుక చక్రాల కింద పడి ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయిన భయానక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తీవ్ర కలకలం రేపింది.
మణుగూరు వద్ద మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి బస్సెక్కింది. బాబు టికెట్ ఖరీదు పది రూపాయలు కాగా, ఆమె వంద రూపాయల నోటు అందించింది. మహిళలకు టికెట్ ఛార్జీలు లేకపోవడంతో బస్సుల్లో నగదు రాబడి పూర్తిగా పడిపోయి, కండక్టర్ ప్రవళిక దగ్గర చిల్లర అందుబాటులో లేదు. దీంతో సాధారణ నిబంధనల ప్రకారమే బాకీ పడ్డ ₹90 మొత్తాన్ని టికెట్ వెనుక రాసి ఇచ్చింది. అయితే, ఇప్పుడే డబ్బులు ఇవ్వాలంటూ సదరు మహిళ కండక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. వివాదం కాస్తా ముదరడంతో విచక్షణ కోల్పోయిన ఆ ప్రయాణికురాలు అత్యంత పాశవికంగా కదులుతున్న బస్సు తలుపుల వద్ద ఉన్న కండక్టర్ ప్రవళికను ఒక్కసారిగా బయటకు తోసేసింది
రోడ్డుపై పడిపోయిన ప్రవళికపై నుంచి బస్సు వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె కాళ్లు తీవ్రంగా విరిగిపోయి రక్తపు మడుగులో విలవిల్లాడింది. తోటి ప్రయాణికులు, డ్రైవర్ వెంటనే స్పందించి క్షతగాత్రురాలిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలు మౌనికపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
క్యాష్ కలెక్షన్ లేక, బ్యాగుల్లో చిల్లర నోట్లు లేక క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సిబ్బంది నిత్యం ఎదుర్కొంటున్న మానసిక, శారీరక నరకానికి ఈ రక్తసిక్త ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. తోటి మహిళ అని కూడా చూడకుండా ఇంతటి కిరాతకానికి ఒడిగట్టడంపై ప్రజా రవాణా ఉద్యోగులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









