తెలంగాణకు తుపాను వర్షాల ఆశలు..!!

వర్షాభావంతో అల్లాడుతున్న తెలంగాణకు బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను కొత్త ఆశలు కలిగిస్తోంది. ఇప్పటికే తగ్గిన వర్షపాతం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ప్రధాన జలాశయాల్లో పడిపోతున్న నీటి నిల్వలతో రాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 28న తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ అత్యంత తీవ్ర తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా తూర్పు, ఈశాన్య జిల్లాలపై ఉండవచ్చు.

ఇది ఇలా ఉంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది.జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు,మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు, హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలలతో పాటు . తుపాను ప్రయాణ మార్గాన్ని బట్టి వర్షాల విస్తృతి, తీవ్రత మారవచ్చు. వాతావరణ శాఖ అంచనా వేస్తోంది

వర్షపాతం లోటుతో తెలంగాణ!

నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలోని అనేక జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా వరంగల్, హనుమకొండతోపాటు పలు ప్రాంతాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది.భూగర్భ జలాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. సెప్టెంబర్ 2025లో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం భూమి ఉపరితలం నుంచి 4.41 మీటర్ల లోతులో ఉండగా, సెప్టెంబర్ 2026 నాటికి 7.52 మీటర్లకు దిగజారింది. అంటే ఏడాదిలో సగటున 3.11 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీరు చేరుతుందా?

తెలంగాణ సాగునీటి అవసరాలకు కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు అత్యంత కీలకం.అయితే ఈ ఏడాది శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. అక్టోబర్ 22 నాటికి శ్రీశైలంలో కేవలం 57.92 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మొత్తం సామర్థ్యం 215.81 టీఎంసీలు అయినప్పటికీ, అందులో వినియోగించగల నీటి పరిమాణం మరింత తక్కువగా ఉంటుంది.తుపాను ప్రభావంతో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిస్తే కొంత ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. అయితే తూర్పు తెలంగాణలో కురిసే వర్షాలన్నీ శ్రీశైలం లేదా నాగార్జునసాగర్‌కు చేరవు. వర్షాలు ఏ నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తాయన్నదే కీలకం.

రబీ సాగుకు ఎంతవరకు ప్రయోజనం?

వర్షాభావంతో ఇప్పటికే రైతులు రెండో పంట సాగుపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి సాగుకు అవసరమైన నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారింది.తుపాను వర్షాలు విస్తృతంగా కురిస్తే చెరువులు, చిన్న జలాశయాలకు కొంత నీరు చేరవచ్చు. నేలలో తేమ పెరగడంతో ఆరుతడి పంటలకు ప్రయోజనం కలగవచ్చు. భూగర్భ జలాల రీఛార్జ్‌కు కూడా కొంత అవకాశం ఉంటుంది.అయితే ఒకటి రెండు రోజుల భారీ వర్షాలతోనే రాష్ట్రవ్యాప్త నీటి సంక్షోభం తొలగిపోతుందని భావించలేం

ఒకవైపు వరద ముప్పు… మరోవైపు నీటి కొరత!

తూర్పు తెలంగాణలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదముంటే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీటి కొరత కొనసాగవచ్చు.తెలంగాణకు ఇప్పుడు అవసరమయ్యేది కేవలం భారీ వర్షాలు కాదు… విస్తృతంగా కురిసి చెరువులు, జలాశయాలను నింపే వర్షాలు. అయితే ఈ తుపాను ఎంత నీటిని అందిస్తుందన్నది రాబోయే రోజుల వర్షపాతం, నదీ ప్రవాహాలు, జలాశయాల నిల్వల ఆధారంగానే తేలనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు