ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శలు!
🔹 రెవెన్యూ లోటు రూ.15,096 కోట్లు..?
ఏప్రిల్–సెప్టెంబర్ 2026 మధ్య రాష్ట్రం రూ.15,096 కోట్ల రెవెన్యూ లోటులోకి వెళ్లిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రకటించిన రూ.6,857 కోట్ల రెవెన్యూ మిగులుకు భిన్నంగా పరిస్థితి మారిందని ఆరోపించారు. ప్రాథమిక లోటు రూ.28,046 కోట్లకు చేరిందని, నెలకు సగటున రూ.2,516 కోట్ల లోటు నమోదవుతోందని పేర్కొన్నారు శ్రవణ్ .
ఆరు నెలల్లోనే 76.31% రుణ పరిమితి వినియోగం:
ఏడాదికి అనుమతించిన నికర రుణ పరిమితి రూ.58,458 కోట్లు కాగా, ఇప్పటికే రూ.44,612 కోట్లు వినియోగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఆరు నెలలకు 23.69% పరిమితి మాత్రమే ఉందని, నవంబర్ నాటికి నగదు లభ్యత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని, దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
పెన్షన్ బడ్జెట్లో 96.60% ఖర్చు :
ఇది ఇలా ఉంటే వార్షిక పెన్షన్ కేటాయింపులు రూ.14,736 కోట్లు కాగా, సెప్టెంబర్ నాటికే రూ.14,235 కోట్లు ఖర్చయ్యాయని విమర్శించారు. మిగిలిన ఆరు నెలలకు రూ.501 కోట్లు (3.4%) మాత్రమే ఉండటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు చెల్లింపులు ఎలా చేస్తారని శ్రవణ్ ప్రశ్నించారు..
సాధారణ రంగంలో మూలధన వ్యయం 18.44 శాతానికి పరిమితమైందని, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి సామాజిక మౌలిక సదుపాయాలపై ఖర్చు 29.91 శాతమేనని పేర్కొన్నారు. ఆస్తుల కల్పన, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం తగ్గిందని విమర్శించారు.మొత్తం వ్యయంలో 80 శాతం సాధారణ పరిపాలన, నిర్వహణ ఖర్చులకే వెళ్తోందని ఆరోపించారు. ‘యంగ్ ఇండియా స్కూల్స్’ హామీలు అమలులో వెనుకబడ్డాయని విమర్శించారు.
కాగా పన్నేతర ఆదాయం 16.10 శాతం, కేంద్ర గ్రాంట్లు 15.34 శాతం, ఎక్సైజ్ ఆదాయ వసూళ్లు 37.84 శాతానికే పరిమితమైనట్లు పేర్కొన్నారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వ హామీలు, పబ్లిక్ అకౌంట్ రుణాలకు సంబంధించిన వివరాలను కాగ్‌కు వెల్లడించలేదని దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, దాసోజు డిమాండ్ చేశారు.









