సుజ్ఞానపురం గ్రామంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
అక్రమ గుడుంబా తయారీ కేంద్రాల ధ్వంసం – పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
భద్రాచలం : సెప్టెంబర్ 2….D వినేష్ TODAY 9….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ పర్యవేక్షణలో దుమ్ముగూడెం, చర్ల పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా దుమ్ముగూడెం మండలం సుజ్ఞానపురం గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్లో గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల్లో గుర్తించిన అక్రమ గుడుంబా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. అలాగే సరైన, చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ గారు గ్రామస్థులతో మాట్లాడి ఎన్డిపిఎస్ నేరాలు, అక్రమ మద్యం,గుడుంబా తయారీ, విక్రయాలు మరియు సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఎవరైనా అనుమానాస్పదంగా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారు.

అదేవిధంగా గ్రామంలోని యువతకు పోలీస్ ఉద్యోగ నియామక అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణా కార్యక్రమాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ నియామక పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమై మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎస్హెచ్ఓ రాజు వర్మ, చర్ల ఎస్హెచ్ఓ వెంకటప్పయ్య, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ, శ్యాం ప్రసాద్, జగన్మోహన్ చారి, పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.









