రాయన్నపేట శివార్లలో మహిళా కూలీలతో ఆత్మీయ ముచ్చట
సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ఆరా..
ప్రభుత్వంపై శ్రమజీవుల హర్షం
TODAY 9….
హంగూ ఆర్భాటాలకు దూరంగా.. సామాన్య ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలను తెలుసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందుకు సాగారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలనే విధానానికి నిదర్శనంగా మదిర నియోజకవర్గ రాయన్నపేట శివార్లలో పంట పొలాల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను ఆయన ఆప్యాయంగా పలకరించారు.
పంట పొలాల్లోకి నేరుగా వెళ్లిన భట్టి విక్రమార్క మహిళా కూలీలతో కొద్దిసేపు ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, ఉపాధి, రోజువారీ కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు అందుతున్నాయా? వాటి ద్వారా ఎంత మేరకు ప్రయోజనం కలుగుతోందని ఆరా తీశారు.
ఈ సందర్భంగా మహిళా కూలీలు తమకు అందుతున్న సంక్షేమ పథకాలపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో తమ పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం వల్ల రూపాయి కరెంటు బిల్లు కూడా చెల్లించాల్సిన పరిస్థితి లేదని ఆనందం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తమ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని కూలీలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమలాంటి పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళా కూలీల మాటలను శ్రద్ధగా విన్న భట్టి విక్రమార్క.. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. పేదలు, రైతులు, కూలీలు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు సమకూరుస్తోందని స్పష్టం చేశారు.
సాధారణంగా రాజకీయ నాయకులు కార్యక్రమాలకే పరిమితమవుతారనే భావనకు భిన్నంగా.. పొలం గట్టుపైకి వెళ్లి శ్రమజీవులతో స్వయంగా మాట్లాడిన భట్టి విక్రమార్క తీరుపై మహిళా కూలీలు హర్షం వ్యక్తం చేశారు. తమ మధ్యకు వచ్చి తమ కష్టాలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆత్మీయత తమను ఆకట్టుకుందని తెలిపారు.
పొలం గట్టుపై పలకరింపు.. శ్రమజీవుల మనసుల్లో ముద్ర:
ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి, సామాన్యులకు మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పిన తీరు అక్కడి శ్రమజీవుల్లో చర్చనీయాంశంగా మారింది.









