జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భద్రాచలం ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తున్న ఉపాధ్యాయుడు మల్లా మోహన్ కుమార్

భద్రాచలం: ఆగస్టు 31:TODAY9


భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం పెద్దపాడు ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మల్లా మోహన్ కుమార్ 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, భద్రాచలం నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారు.

మల్లా మోహన్ కుమార్ జాతీయస్థాయిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు మూడుసార్లు హాజరయ్యారు. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలోని CCRT (Centre for Cultural Resources and Training)లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పప్పెట్రీ (తోలుబొమ్మల కళ)పై ప్రత్యేక శిక్షణ పొందడంతో పాటు సర్టిఫికెట్ అందుకున్నారు.

అదేవిధంగా 64వ నేషనల్ ఆర్ట్ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై, రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందారు. మార్చి నెలలో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్ ప్రోగ్రామ్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని భారత ప్రభుత్వ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఫిబ్రవరి నెలలో బెంగళూరులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన 99 రోజుల కార్యక్రమంలో రవీంద్రభారతిలో ప్రజెంటేషన్ ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ విధంగా రాష్ట్రస్థాయిలో నాలుగు రకాల పోటీల్లో, జాతీయస్థాయిలో మూడు రకాల పోటీల్లో పాల్గొని పలు సర్టిఫికెట్లు సాధించారు.

జపాన్ అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోజర్ అండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్కు తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 97 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కేటగిరీలో భద్రాచలం నియోజకవర్గానికి చెందిన మల్లా మోహన్ కుమార్ ఎంపిక కావడం విశేషం.

ఎంపికైన 97 మందిలో 40 మంది ఉపాధ్యాయులను ఏప్రిల్ నెలలో ఫిన్లాండ్‌కు పంపించగా, రాబోయే సెప్టెంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు జపాన్‌లో నిర్వహించే అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపికైన 40 మంది ఉపాధ్యాయుల బృందంలో మల్లా మోహన్ కుమార్ కూడా చోటు దక్కించుకున్నారు.

భద్రాచలం ప్రాంతానికి చెందిన ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక కావడం నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయ వర్గాలకు గర్వకారణమని పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా భద్రాచలం ప్రాంతీయ కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మల్లా మోహన్ కుమార్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి భద్రాచలం ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు