వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

దోమలు, కలుషిత నీటితో వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి

శుక్రవారం పొడి దినంగా పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

ఆగస్టు 24 (TODAY9):


వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వర్షాల కారణంగా దోమల వ్యాప్తి పెరిగి మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి దోమల వృద్ధిని అరికట్టాలని తెలిపారు.

తలుపులు, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో నిద్రించే సమయంలో దోమతెరలను వినియోగించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి శుక్రవారం ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి ‘శుక్రవారం పొడి దినం’ పాటించాలని ఎమ్మెల్యే కోరారు.

కలుషిత నీటితో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో కలుషిత నీటి కారణంగా గ్యాస్ట్రోఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వడపోసిన లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.

భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు తదితర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు