భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 : TODAY9
సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అధ్యక్షతన సింగరేణి ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.
సుమారు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులు కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులపై పక్షపాత వైఖరితో ఛార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, కంపల్సరీ రిటైర్మెంట్లు వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
విజిలెన్స్ విచారణల సమయంలో వేధింపులు, ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుంటున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలోని పాఠశాలలు, ఉమెన్స్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్‌హాక్, తాత్కాలిక బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ఎనిమిది సర్వేయర్ బ్యాక్‌లాగ్ పోస్టులతో పాటు హిందీ పండిట్ పోస్టులను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ (పా) ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ప్రతినిధులు కోరారు.
ఉద్యోగుల సమస్యలు, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులు.. సింగరేణి యాజమాన్యంతో చర్చించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ దామెర ప్రవీణ్ కుమార్, కేంద్ర కార్యదర్శి మామిడిపల్లి మధు కృష్ణ, ఎస్ టి పి పి వైస్ ప్రెసిడెంట్ పులి సురేష్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ , డైరెక్టర్ (పా) గౌతమ పొట్రు , డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల రావు, జనరల్ మేనేజర్ (పర్సనల్/ ఐ ఆర్ పి యం) జీవీ కిరణ్ కుమార్, జి.ఎం (వెల్ఫేర్) అజయ్ కుమార్ హాజరయ్యారు.









