ఆగస్ట్ 22 : TODAY9…
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో జీవో 97కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను శక్తి విభాగం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 75 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలోకి తీసుకెళ్లడం, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే డిప్లొమా విద్యార్థులకు ఉన్న ఈసెట్ ద్వారా బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ అవకాశాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సాంకేతిక డిప్లొమా విద్యా ప్రమాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో 97ను వెంటనే నిలిపివేయకపోతే విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి ముఖేష్, వాసు, మల్ల గౌతమ్, రవితేజ, నజీర్, సన్నీ పాల్గొన్నారు.









