గురుకుల పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు దాడి చేయటంతో,భయపడ్డ బాధిత విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి దాక్కోగా ,దాడి చేసిన విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోయిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే,ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్‌లోని గిరిజన బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిబ్బంది ఆటల పోటీలు నిర్వహించారు.
ఆ ఆటల పోటీల్లో భాగంగా కబడ్డీ ఆటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై, పదో తరగతి విద్యార్థులు విజయం సాధించారు.ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఓటమి తట్టుకోలేక, పదో తరగతి విద్యార్థులపై, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
సీనియర్ల చేతిలో దాడికి గురైన పదో తరగతి విద్యార్థులు భయంతో సమీపంలోని రైల్వే స్టేషన్‌లో దాక్కోగా, దాడికి పాల్పడిన 50 మంది విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్టు సిబ్బంది తెలియజేశారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకొని పాఠశాలకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులుసిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఘటనపై విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన వారిని ఇంటికి పంపుతామని పాఠశాల ప్రిన్సిపల్ బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులకు సర్ది చెప్పటంతో గొడవ సద్దుమణిగింది…









