మణుగూరు: ఆగస్ట్ :13
మణుగూరు మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య, వృత్తి విద్యా అవకాశాలను మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సమితి సింగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులను మంజూరు చేయాలని వారు కోరారు. మణుగూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, స్థానికంగానే పీజీ విద్య అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
అదేవిధంగా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే వృత్తి విద్యా (Vocational) కోర్సులను మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం మణుగూరు, పినపాక నియోజకవర్గ పరిధిలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారికి నైపుణ్య ఆధారిత విద్య అందించడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి వస్తే మణుగూరు మండలంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య, నైపుణ్య విద్య మరింత చేరువ అవుతుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రెండు అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి, అవసరమైన అనుమతులు మరియు కోర్సులు మంజూరు అయ్యేలా ప్రభుత్వ స్థాయిలో కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.









