డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీలో పర్మినెంట్ ఉద్యోగులు తిరస్కరించిన ఖాళీ సింగరేణి క్వార్టర్లను కూల్చివేయకుండా, ప్రైవేట్ వాహన డ్రైవర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
ఈ మేరకు సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పీవీ కాలనీలో ఖాళీగా ఉన్న పలు క్వార్టర్లకు ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు నిర్వహించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాక కూల్చివేయాలని భావించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అన్నారు.
ప్రస్తుతం ప్రైవేట్ వాహన డ్రైవర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ కార్మికుల్లో అనేక మంది సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ఇంటి అద్దెల కారణంగా వారి కుటుంబాలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
అందువల్ల పర్మినెంట్ ఉద్యోగులు స్వీకరించని ఖాళీ క్వార్టర్లను కూల్చివేయకుండా అవసరమైన మరమ్మతులు చేసి, అర్హులైన ప్రైవేట్ వాహన డ్రైవర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమ చర్యలు ఆచరణలో కూడా ప్రతిఫలించేలా ఈ నిర్ణయం తీసుకుంటే వందలాది కార్మిక కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత కల్పించడంతో పాటు ప్రజాధనం కూడా సద్వినియోగం అవుతుందని కర్నే బాబురావు అభిప్రాయపడ్డారు.









