అశ్వారావుపేట, జూలై 18 (TODAY9):
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సంయుక్తంగా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించి రూ.3 కోట్ల 14 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, గుమ్మడివల్లిలో వీఓ భవనం, అసుపాకలో బోర్వెల్ను ప్రారంభించారు. అలాగే రమణక్కపేటలో సీసీ రోడ్లు, తోగ్గూడెంలో బోర్వెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం కొమరం భీమ్ ఇకోపార్క్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









