•ఆదివాసి చట్టాలని ఉల్లంఘించి ఆదివాసి ప్రజలపై అక్రమ కేసులు పెట్టిన పట్టించుకోని ఐటీడీఏ సిబ్బంది
•ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ధర్నా.
•గడ్డూరిగట్టు,కొయ్యూరు,మామీడిగూడెం పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలి...
TODAY9 : భద్రాచలం డివిజన్ ప్రతినిధి…D వినేష్
ఆదివాసీలకు ఉపయోగపడకుండ సమస్యలు పరిష్కరించకుండా నిరుపయోగంగా ఉన్న ఐటీడీఏ ఆఫీసుని రద్దు చేసుకుంటే మంచిదని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ లు అన్నారు.
సోమవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు పోడు భూములపై ఆదివాసీలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు అడ్డగిస్తూ తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆదివాసి నేతలు ఆరోపించారు.
30,40 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో తాత, ముత్తాతల నుండి నివాసము ఉంటూ పోడుకొట్టుకుని సాగు చేసుకుంటున్న భూములకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి సర్వే చేసి ఇచ్చి ఇప్పుడు రైతుబంధు పధకం వర్తిస్తున్న అలాంటి భూములను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్రమంగా ఆక్రమించుకుంటూ ఏజెన్సీ ప్రజల్ని బెదిరిస్తున్నారని, మొక్కలు వేస్తూ సర్వేలు చేయకుండా వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు . ఈ సమస్యల పరిష్కారం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆగడాలపై ఎన్నోసార్లు పిఓకు విన్నవించుకున్నామని అయినా ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నోటి దగ్గరకు వచ్చిన పంటను కూడా ఈ ఫారెస్ట్ వాళ్లు పీకేసారని అప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని, నష్టపరిహారం చెల్లించలేదని ఆక్రోశం వెళ్లగక్కారు ఇప్పుడు పంటకాలం సమీపిస్తున్న తరుణంలో తమను భూముల వద్దకు పోనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఐటీడీఏ పిఓ జారీ చేసిన అనుమతి పత్రాలు, కోర్టు తీర్పులిచ్చిన పత్రాలు నకిలీవి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఏది నిజం ఏది అబద్దం తేల్చాల్సింది ఎవరు అని వారు ప్రశ్నించారు?. గ్రామ సభ తీర్మానం పీస్ యాక్ట్ ప్రకారం అన్ని అధికారాలు తమకే ఉన్నప్పటికీ, తమ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్ వాళ్లు భూముల్లోకి రావటమే కాకుండా, తమను అక్రమంగా నిర్బంధించి బెదిరించడం సమంజసమా అంటూ నిలదీశారు. భారత రాజ్యాంగం కల్పించిన 5,6 షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి పరిపాలన కొనసాగుతుందో అర్థం కావడం లేదు అన్నారు
చదువుకున్న ఫారెస్ట్ అధికారులే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ చట్టాలను హక్కులను కాలరాస్తూ ఆదివాసులపై పెత్తనం చెలాయిస్తూ భూమిని నమ్ముకొని భూమిలోనే ఉంటూ జీవిస్తున్న ఆదివాసులని అడవిలో నుంచి తరిమివేయటం కోసం ఈ ఫారెస్ట్ అధికారులు కుట్రలు పన్నుతున్నారని, చట్టాలను ఉల్లంఘించి ఏజెన్సీ లోకి అడుగుపెట్టిన ఫారెస్ట్ వారిపై చర్యలు తీసుకోవాలని అక్రమ కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలపై ఐటిడిఏ పిఓకు వినతి పత్రం సమర్పించి సమస్యను వివరించారు. అన్ని వివరాలను తెలుసుకున్న స్పందించిన పిఓ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్ట నరసింహరావు, కుంజ జోగారావు,ఇర్ప ప్రసాద్, తెల్లం పెంటమ్మ సర్పంచ్ జోగారావు, మధు,కొండా స్వామి, రాజమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు….







