. 25 గ్రామాల ప్రజలకు త్వరలోనే ఊరట బుధవారానికల్లా రాకపోకలు పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ హామీ
ఆగస్టు 4…
చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య 163వ జాతీయ రహదారిపై ఇసుకవాగు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలోని డైవర్షన్ రోడ్డు భారీ వర్షాల ధాటికి పూర్తిగా కొట్టుకుపోవడంతో దాదాపు 25 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య కీలక రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రజలు రోజువారీ ప్రయాణాలకు నానా అవస్థలు పడ్డారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న నిర్మాణ సంస్థ ఆలస్యంగా అయినా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం డైవర్షన్ రోడ్డుపై గ్రావెల్ పరుస్తూ పనులను వేగవంతంగా కొనసాగిస్తోంది. తొలిదశలో కాలినడకన వెళ్లే వారికి, ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనువుగా మార్గాన్ని సిద్ధం చేసింది. అనంతరం నాలుగు చక్రాల వాహనాలు సైతం నిరాటంకంగా ప్రయాణించేలా పనులు కొనసాగుతున్నాయి.
నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ బుధవారానికల్లా డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పూర్తిచేసి అన్ని వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.ఈ రహదారి పునరుద్ధరణతో ప్రత్యామ్నాయ మార్గంపై ఆధారపడిన 25 గ్రామాల ప్రజలకు భారీ ఊరట లభించనుంది. అయితే ప్రతి వర్షానికీ డైవర్షన్ కొట్టుకుపోయే పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని, వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులకు శాశ్వతంగా తెరదించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు..










