పశువుల డాక్టర్ ఉన్నట్లా? లేనట్లా?

వ్యాధుల బారిన పడుతున్న పశువులు

కన్నెత్తి చూడని పశు వైద్యాధికారులు

ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు

కారణాలతో కాలయాపన చేస్తున్న అధికారులు

జూలై 30 TODAY 9

ములుగు జిల్లా వాజేడు మండలంలో పశు వైద్య సేవలు పూర్తిగా గాడితప్పాయనే విమర్శలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పశువులు వైరల్, చర్మ, జ్వర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ, సకాలంలో వైద్యం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశువులే జీవనాధారంగా జీవిస్తున్న అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు.
రైతులు కథనం మేరకు మండల పశువుల ఆసుపత్రికి వెళ్లినా వైద్యాధికారులు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కూడా స్పందన కరువవుతోందని ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసినా సరైన స్పందన రావడం లేదని, గ్రామాలకు వచ్చి చికిత్స అందించాల్సిన అధికారులు వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని అంటున్నారు.

పశువులు చనిపోతాయేమోనని ఆందోళన చెందుతున్న రైతులు…

అనారోగ్యానికి గురైన పశువులకు సకాలంలో చికిత్స అందకపోవడంతో వాటి ప్రాణాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, దున్నపోతులు అనారోగ్యానికి గురవడంతో రైతులకు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు.

అప్పులు చేసి పశువులను కొనుగోలు చేసిన రైతులు వైద్య సేవలు అందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పశువులకు వైద్యం చేయించేందుకు రైతులు పలుమార్లు పశువుల ఆసుపత్రికి వెళ్లినా నిరాశే ఎదురవుతోందని ఆరోపిస్తున్నారు.

వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. చివరకు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

లక్షల జీతాలు పొందుతూ… సేవలు మాత్రం కనిపించవా?

ప్రభుత్వం ప్రతి నెల లక్షల రూపాయల వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం లేదని, వ్యాధుల నివారణ చర్యలు కూడా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.

మండలంలోని పశు వైద్య సేవల నిర్లక్ష్యంపై జిల్లా పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి గ్రామానికి సకాలంలో వైద్య సేవలు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు….

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు