పదేళ్లుగా ప్రజలను వెంటాడుతున్న విద్యుత్ కష్టాలు..
•స్థల వివాదంతో తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేత –
•సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న పోలంపల్లి సర్పంచ్, దిశ కమిటీ సభ్యురాలు ధరావత్ హేమలత బాలాజీ – అధికారుల తక్షణ జోక్యాన్ని కోరుతున్న ప్రజలు
ఇల్లందు , జులై 27(TODAY ):
సింగరేణి మండలంలోని భాగ్యనగర్ తండ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ఐదు గ్రామపంచాయతీల ప్రజలు గత పదేళ్లుగా విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016 మార్చి 25న ప్రారంభమైన ఈ ఉపకేంద్రం ద్వారా వేలాది మందికి విద్యుత్ సరఫరా జరుగుతున్నప్పటికీ, స్థల వివాదం కారణంగా తరచూ సరఫరా నిలిచిపోవడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

స్థల యజమానికి న్యాయం జరగలేదనే కారణంతో ఉపకేంద్రం ప్రధాన ప్రవేశ మార్గంలో రాళ్లతో అడ్డుగోడ నిర్మించడంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, వివాదం పేరుతో ఉపకేంద్రానికి వెళ్లి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ ఏఈ, డీఈ, ఎస్‌ఈతో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండల తహసీల్దార్ సమక్షంలో చర్చలు జరిగినా, అనంతరం కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వర్షాకాలంలో విద్యుత్ లేకపోవడంతో దోమల బెడద, విషసర్పాల సంచారం పెరిగి చిన్నారులు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోలంపల్లి సర్పంచ్, దిశ కమిటీ సభ్యురాలు ధరావత్ హేమలత బాలాజీ నిరంతరం అధికారులతో చర్చలు జరుపుతూ, సంబంధిత శాఖల దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే భాగ్యనగర్ తండ సర్పంచ్ బానోత్ హీరాలాల్ సైతం సమస్య పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది.
జిల్లా కలెక్టర్, టీజీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తక్షణమే జోక్యం చేసుకుని స్థల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, జీవనానికి సంబంధించిన ఈ సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా అత్యవసరంగా పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.









