జ్వరానికి చికిత్స.. 14 ఏళ్ల బాలుడు మృతి.. వైద్యంపై తండ్రి అనుమానం!

బోడుప్పల్‌లోని అరవింద్ ఎన్‌క్లేవ్‌కు చెందిన వంగపల్లి అనురుషిక్ (14) జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం మృతి చెందాడు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే,ఈ నెల 7న బాలుడు చెంగిచెర్లలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ క్లినిక్‌లో సాయి కృష్ణ అనే వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. మరుసటి రోజు జ్వరం రావడంతో తల్లి తిరిగి క్లినిక్‌కు తీసుకెళ్లగా, ఇంజెక్షన్‌, సెలైన్‌ ఇచ్చి మెరుగైన చికిత్స కోసం మిరాకిల్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే మిరాకిల్ ఆసుపత్రిలో వైద్యులు సుమారు 50 నిమిషాల పాటు చికిత్స అందించారు. దాదాపు 30 నిమిషాలు సీపీఆర్ చేసినప్పటికీ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారు. క్లినిక్‌లో అందించిన చికిత్సపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. బాలుడి మృతికి అసలు కారణం, క్లినిక్ చికిత్సతో ఏమైనా సంబంధం ఉందా, వైద్య విధానాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలపై పోస్టుమార్టం నివేదిక, వైద్య రికార్డులు, దర్యాప్తు ద్వారా స్పష్టత రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు