హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు చేపట్టాలని సూచించారు.
సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ALIMCO ఆధ్వర్యంలో ADIP పథకం కింద అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. డప్పు చాటింపుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి, ఒక్క అర్హుడూ మిస్ కాకుండా గుర్తించాలని సూచించారు.
ప్రత్యేక శిబిరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, హనుమకొండ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు శిబిరాలు నిర్వహించనున్నారు.
శిబిరాలకు ముందే లబ్ధిదారుల వివరాలతో పూర్తి స్థాయి డేటా సిద్ధం చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు అర్హులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓలతో పాటు జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.









