•ప్రపంచ బ్రాయిలర్ జన్యువులపై రెండు కంపెనీల పెత్తనం..
•భారత్‌లో ‘కాబ్’ హవా.. వెంకీస్ ద్వారా 65 శాతానికి పైగా వాటా..
•సొంత జాతులతో చైనా ఎదురీత.. దక్కింది 28 శాతమే..
•మూలన పడిన మన నాటు కోడి..
మీ పళ్లెంలోకి వచ్చే బ్రాయిలర్ కోడి ఏ ఊరి ఫారంలో పెరిగినా.. దాని జన్యు మూలాలు చాలావరకు రెండు విదేశీ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. ఒకటి ఏవియాజెన్. రెండోది కాబ్-వాంట్రెస్. హబ్బర్డ్‌తో కలిపి ప్రపంచంలో ప్రధాన బ్రాయిలర్ బ్రీడింగ్ కంపెనీలు మూడే కావటం గమనార్హం .
అమెరికాలోని అలబామా కేంద్రంగా ఉన్న ఏవియాజెన్‌ను 2005లో జర్మనీకి చెందిన ఎరిక్ వెస్‌జోహాన్ గ్రూప్ కొనుగోలు చేసింది. రాస్, ఆర్బర్ ఏకర్స్ జాతులు ఈ సంస్థవే. కాబ్-వాంట్రెస్.. అమెరికా మాంస దిగ్గజం టైసన్ ఫుడ్స్ అనుబంధ సంస్థ. 120కి పైగా దేశాల్లో బ్రీడింగ్ కోళ్లను అమ్ముతోంది. పరిశ్రమ వర్గాల పాత లెక్కల ప్రకారం ఏవియాజెన్ వాటా 44 శాతం కాగా, కాబ్ వాటా 47-48 శాతంగా ఉంది .

భారత్‌లో వెన్‌కాబ్..
ఇది ఇలా ఉంటే భారత్‌లో పైచేయి వెంకాబ్‌దే. అయితే నేరుగా కాదు. పుణె కేంద్రంగా ఉన్న వెంకటేశ్వర హేచరీస్ (వెంకీస్) గ్రూప్ ‘వెన్‌కాబ్’ పేరుతో ఈ జాతిని విక్రయిస్తోంది. దేశ బ్రాయిలర్ మార్కెట్లో కాబ్ వాటా కనీసం 65 శాతమని 2016 నాటి పరిశ్రమ నివేదిక పేర్కొంది. ఇప్పుడది 75 శాతం దాటిందని వెంకీస్ అనుబంధ వర్గాల లెక్కలు చెబుతున్నాయి . ఇక్కడి వాతావరణం, పెంపకం పద్ధతుల్లోనే కోళ్లను ఎంపిక చేసి అభివృద్ధి చేయడం వల్ల ఈ జాతి బలంగా ఉంది .వీళ్లకు పోటీగా ఏవియాజెన్ 2015లో ‘రాస్ 308 ఏపీ’ జాతిని తీసుకొచ్చింది. దాని భాగస్వామి ఐబీ గ్రూప్ 22 రాష్ట్రాల్లో రాస్ కోడిపిల్లలను సరఫరా చేస్తోంది.
చైనా సొంత దారి
చైనా 1990ల్లో అభివృద్ధి చేసుకున్న సొంత జాతి 2004లో వ్యాధితో తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి నుంచి ఏటా 8 నుంచి 12 లక్షల సెట్ల బ్రీడింగ్ కోళ్లను దిగుమతి చేసుకుంది. 2021 చివర్లో షెంగ్‌జే 901, వోడ్ 188, గ్వాంగ్‌మింగ్ 2 అనే మూడు స్వదేశీ జాతులకు అనుమతి లభించింది. అయితే ‘గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టాం’ అని చైనా అధికార మీడియా ప్రకటించింది. కాగా ఆ దేశ లెక్కల ప్రకారమే ఈ మూడింటి వాటా 28 శాతం. మిగతా 72 శాతం విదేశీ జన్యువులే. 2035 నాటికి 60 శాతం సాధించాలన్నది లక్ష్యం. టాంజానియా, జింబాబ్వేలకు ఎగుమతులూ మొదలయ్యాయి.
నాటు కోడి ఎక్కడ?
ఈ పరుగులో వెనుకబడింది నాటు కోడి. దేశంలో 19 నమోదిత దేశీ జాతులు, దాదాపు 10.9 కోట్ల నాటు కోళ్లు ఉన్నాయని, జాతులు అంతరించలేదని, కాగా వాణిజ్య పౌల్ట్రీ విస్తరణతో స్థానిక జాతుల సంఖ్య, స్వచ్ఛత వేగంగా తగ్గాయని ఎన్‌బీఏజీఆర్ శాస్త్రవేత్తలు 2006లోనే పేర్కొన్నారు.చైనా మాత్రం తన దేశీ ‘పసుపు ఈకల’ కోళ్లను వాణిజ్య స్థాయికి చేర్చింది. 2024లో వాటి ఉత్పత్తి 330 కోట్లు. విదేశీ జన్యువును దేశీయం చేసుకుని భారత్ మార్కెట్‌ను నిలబెట్టుకుంది. సొంత జన్యువు కోసం చైనా ఖరీదైన పోరు సాగిస్తోంది.









