దేశ వ్యవసాయాన్ని ప్రభావితం చేసిన నైరుతి రుతుపవనాల్లో అసమాన వర్షాలు…
🔷 2026-27 ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 373.93 మిలియన్ టన్నులకు పరిమితం చేసిన .ప్రభుత్వం..
తెలుగు రాష్ట్రాలకు రబీ మరింత కీలకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావంతో పాటు ప్రధాన జలాశయాలకు ఆశించిన స్థాయిలో నిరంతర ప్రవాహాలు రాలేదు. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టులపై నీటి ఒత్తిడి కొనసాగుతుండగా, పెన్నా బేసిన్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
APలో గోదావరి డెల్టాకు మాత్రం గోదావరి ప్రవాహాల కారణంగా తులనాత్మకంగా మెరుగైన నీటి లభ్యత ఉంది. కానీ కృష్ణా–పెన్నా ఆధారిత ప్రాంతాల్లో రబీ సాగుకు నీటి భరోసా ప్రధాన ప్రశ్నగా మారుతోంది. తెలంగాణలోనూ కృష్ణా ఆధారిత సాగునీటి ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం నీటి కొరత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
మహారాష్ట్రలోని మరాఠ్వాడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది . ప్రాంతంలో వర్షలోటు సుమారు 18% ఉండగా, లాతూర్‌లో 48%, పర్భణిలో 43% లోటు నమోదైంది. అనేక గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ట్యాంకర్లు నడుస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు అసలు పరీక్ష రబీ సీజన్. రబీ నుంచి 177.72 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జలాశయాల్లో నీరు, నేల తేమ, భూగర్భజలాల లభ్యతే దీన్ని నిర్ణయించనున్నాయి. నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటల వైపు మారాలని కేంద్రం సూచిస్తోంది.
చివర్లో కురిసిన వర్షాలతో వర్షాభావ పరిస్థితి కొంత తగ్గినా, ఒకటి రెండు భారీ వర్షాలు మొత్తం సీజన్‌లో ఏర్పడిన soil- moisture stressను పూర్తిగా భర్తీ చేయలేవు. పంటకు అవసరమైన సమయంలో వర్షం, జలాశయాల్లో నిల్వలు, భూగర్భజలాలే దిగుబడులను నిర్ణయిస్తాయని తెలిసిందే .
ఏతా వాతా చూస్తే ఖరీఫ్‌ను వర్షాభావం పరీక్షించింది… ఇప్పుడు రబీని జలాశయాల్లో నీటి లభ్యత పరీక్షించబోతోంది. గోదావరి డెల్టా మినహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రధాన సాగునీటి ప్రాంతాలకు ఈ రబీ సీజన్ సవాలుగానే కనిపిస్తోంది.









