డిజే (DJ) శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర నరకం , ఎదుర్కొంటున్న ప్రజలు..

డీజే శబ్దాల మరణ మృదంగం: హైకోర్టు దృష్టికి సగటు పౌరుడి ఆవేదన

TODAY 9…

​ ఈ మధ్యకాలంలో డీజే లేనిదే ఏ ఫంక్షన్స్ నడవడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అది పెళ్లి అయినా, ఏ ఇతర ఫంక్షన్ అయినా డీజే కావల్సిందే. వినాయక చవితి వంటి ఉత్సవాలు ఊరేగింపులలో ఇక చెప్పాల్సిన పనిలేదు డీజే మోతల్లో డ్యాన్సులు వేస్తుంటే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారు యువత. డీజే కొందరికి మోజే కావచ్చు కాగా అందులోంచి వచ్చే శబ్ద తరంగాల వల్ల గుండె సంబంధమైన ఇబ్బందులు, కర్ణభేరికి వచ్చే సమస్యలు, అదేవిధంగా గర్భస్థ శిశువులలో ఏర్పడే లక్షణాలు ప్రమాదాలు అంతా ఇంతా కాదు అంటున్నారు నిపుణులు.


​నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన నర్సింహ (35) అనే యువకుడు గణేష్ నిమజ్జనం సందర్భంలో డీజే శబ్దాల తీవ్రతకు ఛాతీ నొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. వినోదం పేరుతో పెడుతున్న డీజేల శబ్ద కాలుష్యం నేడు అమాయకుల ప్రాణాలను బలితీసుకునే రాక్షసత్వంగా మారింది.


​ప్రాణాపాయం & ఆరోగ్య సమస్యలు: అధిక డెసిబెళ్ల శబ్దం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గర్భిణులు, పసిపాపల చెవులు చిల్లులు పడేలా ఈ శబ్దాలు గుప్పిస్తున్నాయి.
​ప్రజా జీవనానికి విఘాతం: ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేము, వ్యాపారాలలో ఫోన్లు మాట్లాడలేము, శబ్దాల దాడికి ఎదురుగా నిలబడే పరిస్థితి లేదు. రోడ్డుపై వెళ్లే బాటసారులు, వాహనదారులు తీవ్ర అసహనానికి, ప్రమాదాలకు గురవుతున్నారు.
​విద్యార్థుల నష్టం: పరీక్షల సమయంలో రాత్రంతా మోగే ఈ డీజేల ధ్వనికి విద్యార్థులు చదువుకోలేక మానసిక వేదనకు గురవుతున్నారు.
​
​పౌరుల “జీవించే హక్కు” (ఆర్టికల్ 21) ని రాజ్యాంగం ప్రసాదించినప్పుడు, ప్రశాంతంగా జీవించే హక్కును ఈ డీజేల శబ్ద కాలుష్యం హరిస్తుంటే న్యాయస్థానం ఎందుకు కఠినమైన సంచలన తీర్పును స్వచ్ఛందంగా ఇవ్వడం లేదు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
​

ఇది ఇలా ఉంటే సాధారణ వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోయినా, త్రిబుల్ రైడింగ్ చేసినా వెంటనే చలాన్లు విధిస్తూ హంగామా చేసే పోలీసులు, ప్రజల ప్రాణాలను బలితీసుకునే డీజేల నిర్వాహకులపై, డీజే సౌండ్ సిస్టమ్‌లపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనేది మరి కొందరి సందేహం.


​సుప్రీంకోర్టు, హైకోర్టులు శబ్ద నియంత్రణపై గతంలో స్పష్టమైన నిబంధనలు (సాధారణంగా 55-65 డెసిబెల్స్) విధించినప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విఫలమవుతున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని కోర్టు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు?
​ఎంతమంది అమాయక ప్రజలు, పసిపాపలు, గుండె జబ్బు బాధితులు ఈ డీజేల శబ్ద ధాటికి బలికావాలి? న్యాయమూర్తులు తమ కళ్లను, మనసును, హృదయాన్ని తెరచి ఈ ప్రజా వేదనను ఎప్పుడు గమనిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
​
అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు ఇప్పటికైనా స్పందించి, డీజేల వాడకంపై కఠినమైన నిషేధం లేదా కచ్చితమైన శబ్ద పరిమితి నిబంధనలను అమలు చేయకపోతే, ఇది సగటు పౌరుడి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేని సమాజంగా మిగిలిపోతుంది. న్యాయస్థానం తక్షణమే జోక్యం చేసుకుని అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు