హైదరాబాద్ : డెయిరీల్లో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనల కారణంగా, రెండు లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు.హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో TG SAFEకి చెందిన 10 ప్రత్యేక బృందాలు 20 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు గుర్తించారు.
ఇది ఇలా ఉండగా కొన్ని డెయిరీల్లో ఈగలు, బొద్దింకల బెడద, నీరు నిల్వ ఉండటం, బూజు, తుప్పుపట్టిన పరికరాలు, అధ్వాన్నమైన డ్రైనేజీతో పాటు వాటర్ టెస్టింగ్, పెస్ట్ కంట్రోల్, సిబ్బంది ఆరోగ్య రికార్డులు సరిగా లేవని అధికారులు గుర్తించారు. కల్తీ అనుమానంతో 18 శాంపిల్స్ సేకరించారు.

మరోవైపు ఇంజాపూర్‌లోని Federated White Nectar, పాల్మాకోల్లోని Shanthi Farm and Agri Products, బైరామల్‌గూడ Dairy Spot, కర్మన్‌ఘాట్ Sri Laxmi Narsimha Milk Traders సహా మొత్తం 10 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. నిబంధనల అమలుపై మళ్లీ తనిఖీలు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అలాగే హయత్‌నగర్‌లో FSSAI లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో నడుస్తున్న Venkata Shiva Milk Pointను మూసివేశారు. Saritha Dairy, Sri Sai Dairy Products, Milky Plus Foods (Gayathri Dairy)లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి జరిమానాలపై తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
కర్మన్‌ఘాట్ సాగర్ రోడ్డులోని Sapthagiri Foods, అబ్దుల్లాపూర్‌మెట్ పసుమాములలోని All Rich Dairy Pvt Ltdకు చెందిన FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని TG SAFE ఆదేశించింది.
నగరంలోని Sapthagiri Foodsలో నాచు పట్టిన ఫ్లోరింగ్, సరైన డ్రైనేజీ లేకపోవడం, భారీగా ఈగలు, చెత్త పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ లోపాలు, నీరు-పాల పరీక్షల రికార్డులు లేకపోవడం, సిబ్బంది పరిశుభ్రత సరిగా లేకపోవడం గుర్తించారు. All Rich Dairyలో ఈగలు, బొద్దింకలు, నీరు నిలిచిన జారుడు నేల, సరైన వెలుతురు లేకపోవడం, కోల్డ్రూమ్లో పాన్ మసాలా ఉమ్మివేయడం, గోడలు-పైకప్పు పెచ్చులూడటం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రతను కచ్చితంగా పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.
హయత్‌నగర్‌లో డెయిరీలపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. లైసెన్స్ లేని సంస్థ మూసివేత..

హయత్‌నగర్‌లోని డెయిరీ యూనిట్లు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం మంగళవారం ఉదయం స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించింది. పరీక్షల కోసం ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్ సేకరించింది.
లైసెన్స్ లేకుండా నిర్వహించడంతో పాటు అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించిన ఓ సంస్థను అధికారులు మూసివేశారు. సేకరించిన శాంపిల్స్‌ను నిబంధనల ప్రకారం పరీక్షించనున్నారు. డెయిరీ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు ఆహార భద్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా తనిఖీ చేయడంలో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.









