బంజారా సమాజం మనోభావాలను గౌరవించాలి: ధరావత్ బద్రు నాయక్…
భద్రాద్రి కొత్తగూడెం , జూలై 6(TODAY9):
బంజారా సమాజానికి ఆరాధ్య దైవమైన శ్రీ శీతల మాత పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని బంజారా నాయకుడు ధరావత్ బద్రు నాయక్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 7న జరగనున్న శీతల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించి బంజారా సమాజం మనోభావాలను గౌరవించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా తండాలు, గ్రామాల్లో బంజారా ప్రజలు శ్రీ శీతల మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా పూజిస్తూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు.
శీతల పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచిందని, లక్షలాది మంది బంజారా కుటుంబాలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రధాన పండుగలకు ప్రభుత్వం అధికారిక సెలవులు ప్రకటిస్తున్నట్లుగానే, బంజారా సమాజ విశ్వాసాలను గౌరవిస్తూ శీతల పండుగకు కూడా అధికారిక సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
బంజారా సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, శీతల పండుగకు అధికారిక గుర్తింపు కల్పించడం ద్వారా గిరిజన సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని ధరావత్ బద్రు నాయక్ పేర్కొన్నారు.









