‘స‌ర్’ ఎన్యూమరేషన్‌లో ఓటర్ల ఆందోళన..

కొత్తగూడెం: జులై 06 (TODAY9) :

ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ కొనసాగుతున్న వేళ పలువురు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 2026 ఓటరు జాబితాలో పేర్లు ఉండి, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ, 2002 నాటి ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలనే అయోమయంలో ఉన్నారు.

మరోవైపు 2026 ఓటరు జాబితాలో పేరు ఉన్న కొంతమంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు కూడా అందలేదని స్థానికులు చెబుతున్నారు. ఫారాలు అందిన వారిలో కూడా 2002 ఓటరు జాబితాలో వివరాలు లేకపోవడంతో ఏ విధంగా ఫారాన్ని పూర్తి చేయాలనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీంతో బీఎల్‌ఓలు, రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్నా స్పష్టమైన మార్గదర్శకాలు కావాలని ఓటర్లు కోరుతున్నారు.

అధికారుల సూచన మేరకు 2002 నాటి అర్హతను నిరూపించేందుకు పదో తరగతి సర్టిఫికెట్, విద్యా ధ్రువపత్రాలు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్‌లు, గ్యాస్ కనెక్షన్ పత్రాలు లేదా కుటుంబ సభ్యుల పేర్లు 2002 ఓటరు జాబితాలో ఉంటే వాటిని ఆధారంగా చూపించి ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ పాత జాబితాలో పేరు లేకపోవడం వల్ల అనేక మంది ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉండగా,సమస్యలు ఎదుర్కొంటున్న ఓటర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా స్పందించి, పాత రికార్డులను పరిశీలించి అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు