ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.
భద్రాచలం మే 18 : టుడే 9 ప్రతినిధి
వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాల కొరకు అర్జీలు పెట్టుకునే గిరిజనులకు సత్వరమే అందేలా సంబంధిత యూనిట్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యూనిట్ అధికారులకు ఆదేశించారు.
సోమవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి దరఖాస్తులను ఫిర్యాదులను సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి ఆనంద్ కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏడిఎంహెచ్వో సైదులతో కలసి స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏజెన్సీ ఏరియాలోని పలు మండలాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను పి ఓ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పి ఓ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల యూనిట్ అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
గిరిజనుల ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం, జాప్యం చోటుచేసుకోకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. సమస్యల వెనుక ఉన్న మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని యూనిట్ అధికారులకు సూచించారు. గిరిజనుల సేవలో పారదర్శకత, బాధ్యతాయుత ధోరణితో పనిచేయాలని తెలిపారు.
గిరిజనులు తమ వినతులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. గిరిజన దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు గిరిజనులకు మరింత చేరువ కావాలని, గిరిజనుల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అందించేందుకు అన్ని శాఖల యూనిట్ అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఐటీడీఏ పీవో ఆదేశించారు.
గిరిజనులు సమర్పించిన అర్జీలలో పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పోడు పట్టాలలో పేర్లు మార్పు కొరకు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, ఇందిరా గిరిజన వికాసం పథకము ద్వారా బోర్లు వేయించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, నూతనంగా ఇసుక మత్స్య సొసైటీలు ఏర్పాటు కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక అభివృద్ధి కల్పించుట కొరకు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజనులకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, పి వి టి జి అధికారి గన్యా, ఎల్ టి ఆర్ డి టి మనిధర్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణరావు, హౌసింగ్ ఏఈ హేమంత్, ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ, మేనేజర్ ఆదినారాయణ, ఇతర శాఖల సిబ్బంది నరేందర్, లింగా నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.









