అధికారులతో ప్రత్యేక సమావేశంలో సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 3
టుడే 9 ప్రతినిధి
2022 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఉండి జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత అధికారులకు సూచించారు.

బుధవారం నాడు సబ్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన గోదావరి వరదల వలన ముంపునకు గురి అయ్యే ఏజెన్సీ మండలాలలోని గ్రామాలకు చేపట్టవలసిన మౌలిక సదుపాయాల గురించి డివిజనల్ లెవెల్ సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది వరదలు తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ముంపు ప్రాంత గ్రామాలను గతంలో మాదిరిగా గుర్తించి వారికి సంబంధించిన పునరావాస కేంద్రాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రధానంగా ఏడు ముంపు మండలాల గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గతంలో ఎక్కడెక్కడ పునరావాస క్రేంద్రాలను ఏర్పాటు చేశారో అదే మాదిరిగా ఇప్పుడు కూడా గుర్తించాలన్నారు. అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలని,వరదల సమయంలో ఉద్యోగులు ఎవరు అనుమతి లేకుండా ముందస్తు సెలవులు తీసుకోవద్దని తెలిపారు. గతంలో మాదిరిగానే సమన్వయంతో సమష్టిగా పనిచేసి వరదలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం ఉండాలని అన్నారు.
ముంపు గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే దగ్గర నుంచి వారికి కల్పించాల్సిన మౌలిక వసతుల వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. వరదల సమయంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం, పశువుల నష్టం, జరగకుండా చూడటమే అందరి లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
వరద తాకిడికి గురి అయిన గ్రామాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పునరావాస కేంద్రాలలో మంచినీరు సరిపడా ఆహారము మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. వరదలు ఎక్కువైనప్పుడు రోడ్లమీద గ్రామాలకి వెళ్లే మార్గాలలో కెనాల్సు పొంగిపొర్లుతాయని, ప్రజలు వెళ్లకుండా పంచాయతీ సెక్రటరీలు పోలీస్ శాఖ వారు కాపలా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, మత్స్య శాఖ వారు బోట్లు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాలలో కరెంటు సరఫరా 24 గంటలు ఉండాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ సిబ్బంది 24 గంటలు గిరిజనులకు సేవ చేయాలని అన్నారు. గోదావరి వరదలు వస్తున్నప్పుడు రైతులు కరెంటు మోటార్లు ద్వారా పొలాలకు నీళ్లు సరఫరా చేయడానికి అమరుస్తారని వారికి కరెంటు మోటార్లు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలలో ముందస్తుగానే సంబంధిత అధికారులు పంచాయతీ సెక్రెటరీ ద్వారా గ్రామములో మైకుల ద్వారా ప్రచారం చేయించి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలైన లంక గ్రామాలలో ఉన్న ప్రజలను ముందస్తుగా జాగ్రత్తలు పాటించి వారికి ప్రాణ నష్టం మరియు పాడి పంటలు పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని, వరద ముంపునకు గురి అయ్యి రవాణా సౌకర్యం అందుబాటు లేని గ్రామాలలో డ్రోన్ సౌకర్యం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచినీరు ఆహార పొట్లాలు సరఫరా చేసే విధంగా సంబంధిత డ్రోన్ ఆపరేటర్లకు ఇప్పటినుండే శిక్షణ అందించాలని, ఇరిగేషన్ శాఖ, మత్స్యశాఖ అధికారులు వాగులు మరియు చెక్ డ్యాములు పొంగిపొర్లేటప్పుడు వరదలను అదుపు చేయడానికి తగినన్ని ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని అలాగే జెసిబి లు డీజిల్ జనరేటర్లు ఏర్పాట్లు చేసుకోవాలని, గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలుగా రక్షక బృందాలను ముంపుకు గురి అయ్యే ప్రాంతాల సమీపంలో ఏర్పాట్లు చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు ఎన్ డి ఆర్ ఎఫ్ డిడిఆర్ఎఫ్ సింగరేణి రెస్క్ టీం అగ్నిమాపక శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసే బోట్లు లైఫ్ జాకెట్లు రోడ్స్ చెట్లను తొలగించడానికి కావలసిన కట్టర్లను ఇతర రక్షణ సామాగ్రిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
గోదావరి వరదలు అనేవి అనుకోని రావని అనుకోకుండా జరిగే ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించి ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆయన అన్నారు. అధికారులందరూ వచ్చే సమావేశానికి గోదావరి వరదలలో విధులు నిర్వహించే అధికారులు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి అరుణ్ కుమార్, ఎస్ డి సి ఆనంద్ కుమార్ డి ఎల్ పి ఓ సుధీర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీధర్, ఏవో భగవాన్ రెడ్డి, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.









