ఆ పేద దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, పేదరికంతోపాటుగా సంతానం కూడా పెరిగిపోతుండటం వారికి శాపంగా మారింది. అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉండడం, పిల్లలను పోషించే స్తోమత తమకు లేకపోవటంతో రూ.3 లక్షలకు నాలుగో సంతానాన్ని విక్రయించిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాలో చోటు చెస్ముకుంది.ముగ్గురు ఆడపిల్లలతో కలిసి నివసిస్తున్న దేవీసింగ్, శిరీష దంపతులు ఈ ఏడాది మార్చి నెలలో మెదక్ మాతా శిశు కేంద్రంలో శిరీష మరో ఆడబిడ్డకు జన్మనివ్వగా, పోషించే స్తోమత లేక బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షలకు సిద్ధిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు శిశువును విక్రయించారు. ప్రసవం అనంతరం తల్లి వద్ద బిడ్డ లేకపోవడం గమనించిన అంగన్వాడీ సిబ్బంది ఐసీడీఎస్ అధికారికి సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. తండాలో విచారించి శిశు విక్రయం జరిగిందని నిర్ధారించి ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిశువు తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.









