మైనర్‌తో పెళ్లైనా పోక్సో నుంచి తప్పించుకోలేరు పర్సనల్ లా రక్షణ కాదు : ఢిల్లీ హైకోర్టు…

మైనర్‌తో పెళ్లైనా సరే పోక్సో నుంచి తప్పించుకోలేరు పర్సనల్ లా రక్షణ కాదు అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చెల్లుబాటు అవుతుందనే వాదన ఉన్నప్పటికీ భార్యకు 18 ఏళ్లు నిండకపోతే లైంగిక సంబంధంపై పోక్సో చట్టం, బీఎన్ఎస్ నిబంధనల నుంచి రక్షణ లభించదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘బిలాల్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ’ కేసులో జస్టిస్ సంజీవ్ నారులా ఈ నెల 23న తీర్పు ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే ఒక యువతి 2008 సెప్టెంబర్ 19న జన్మించగా, 2024 డిసెంబర్ 20న 16 ఏళ్ల 3 నెలల వయసులో సుమారు 28 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తన ఇష్టప్రకారమే జరిగిందని, కుటుంబాల అంగీకారం ఉందని, బలవంతం లేదా లైంగిక దాడి జరగలేదని యువతి తెలిపింది.

2026 మేలో గర్భధారణకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో స్కూల్ రికార్డుల ద్వారా ఆమె వయసు బయటపడింది. దీంతో పోలీసులు FIR No.189/2026 నమోదు చేసి బీఎన్ఎస్ సెక్షన్ 64(1), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు పెట్టారు. అనంతరం గర్భంలోని శిశువు మృతి చెందగా, మృత శిశువు డీఎన్ఏ పరీక్షకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టారు.

ఇది ఇలా ఉంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం యువతి యుక్తవయసుకు చేరిందని, అందువల్ల వివాహం చెల్లుబాటు అవుతుందని పిటిషనర్లు వాదించారు. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడంతో పాటు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు, పరిహారం కోరారు. కోర్టు మాత్రం వివాహం చెల్లుబాటుపై తుది నిర్ణయం ఇవ్వకుండా వివాహం చెల్లుబాటైనదిగా భావించినా, మైనర్‌తో లైంగిక సంబంధంపై క్రిమినల్ చట్టాల అమలు వేరే అంశమని స్పష్టం చేసింది.

పోక్సో సెక్షన్ 2(1)(d) ప్రకారం 18 ఏళ్లలోపు వ్యక్తి ‘చైల్డ్’. సెక్షన్లు 3, 5, 6 ప్రకారం మైనర్‌పై లైంగిక చర్యల్లో ‘సమ్మతి’కి చట్టపరమైన ప్రాధాన్యం ఉండదని కోర్టు వివరించింది. పోక్సో సెక్షన్ 42-A ప్రకారం ఇతర చట్టాలతో విరుద్ధత తలెత్తినప్పుడు పోక్సో నిబంధనలకే పైచేయి ఉంటుందని గుర్తుచేసింది.బీఎన్ఎస్ సెక్షన్ 63 కూడా 18 ఏళ్లలోపు యువతితో లైంగిక సంబంధాన్ని ఆమె సమ్మతితో సంబంధం లేకుండా అత్యాచారంగా పరిగణిస్తుందని కోర్టు ప్రస్తావించింది. వివాహ సంబంధంలోని మినహాయింపు కూడా 18 ఏళ్లలోపు భార్య విషయంలో వర్తించదని వివరించింది.

మైనర్ లేదా ఆమె కుటుంబం ఫిర్యాదు చేయకపోయినా కేసు నమోదు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. పోక్సో సెక్షన్ 19 ప్రకారం నేరానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు రిపోర్టింగ్ బాధ్యత ఉంటుందని, అందువల్ల ఆస్పత్రి నుంచి సమాచారం వెళ్లడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది.

కాగా చివరగా ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసులపై చర్యలు, పరిహారం కోరిన అభ్యర్థనలను కూడా తోసిపుచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు క్వాష్ పిటిషన్ పరిధికే పరిమితమని, నిందితుడు దోషి అని తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. సాక్ష్యాల ఆధారంగా ట్రయల్ కోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఉన్న బెయిల్ ఉత్తర్వులను మార్చలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు