గుర్రం ముందు బండి పెట్టినట్లుంది.. ఫామ్-18 గడువుపై దాసోజు శ్రవణ్ ఫైర్…
ప్రాథమిక అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తికాకముందే పట్టభద్రుల ఓటరు నమోదు ఫామ్-18కు గడువు నిర్ణయించడం పరస్పర విరుద్ధమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. దీనివల్ల వేలాది మంది అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆరోపించారు.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఫామ్-18 దరఖాస్తుల గడువు నవంబర్ 6, 2026గా ఉండగా.. SIR షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ తుది ఓటర్ల జాబితా నవంబర్ 9న ప్రచురించనున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
ఫామ్-18లో అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్, EPIC వివరాలు అవసరమని.. SIRలో కొత్తగా నమోదయ్యే లేదా వివరాలు మార్చుకునే ఓటర్లకు నవంబర్ 6 నాటికి ఖరారైన EPIC, పార్ట్ నంబర్ వివరాలు అందుబాటులో ఉండకపోవచ్చని శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ పోర్టల్లో ధ్రువీకరణ సమస్యలు తలెత్తి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 9 వరకు ఖరారు కాని ఓటరు జాబితా వివరాలను నవంబర్ 6లోపే ఇవ్వాలని కోరడం ఎలా సమంజసమని ప్రశ్నించారు.
కాగా ఈ పరిపాలనాపరమైన సమస్యను ECI, తెలంగాణ CEO వెంటనే పరిష్కరించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఫామ్-18 దరఖాస్తుల గడువును నవంబర్ 9 తర్వాత వరకు పొడిగించి, సవరించిన నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.









