తెలంగాణలో వర్షాభావం రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ అసెంబ్లీ తీర్మానం…

తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది…

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షపాతం లోటు ఏర్పడిందని ముసాయిదా తీర్మానంలో ప్రభుత్వం తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు సాధారణ 664.5 మి.మీ.కు బదులుగా 536.5 మి.మీ. వర్షపాతమే నమోదై 20 శాతం లోటు ఏర్పడింది. 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉండగా, వానాకాలం పంటల సాగు 88 శాతానికే పరిమితమైందని . వరి సాగు దాదాపు 18 శాతం తగ్గిందని ప్రకటించింది .

కాగా సెప్టెంబర్ 15 నాటికి ప్రధాన జలాశయాల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి 241 టీఎంసీల లైవ్ స్టోరేజ్ మాత్రమే ఉందని ప్రభుత్వం తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 497 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నిల్వలు యాసంగి సాగుకు సరిపోవని అంచనా వేసింది. తాగునీరు, భూగర్భ జలాలు, పశుగ్రాసం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు ఉపశమన చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

ఇది ఇలా ఉంటే పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని, NDRF నుంచి తగిన సాయం మంజూరు చేయడంతో పాటు SDRFలో కేంద్ర వాటాను త్వరగా విడుదల చేయాలని తీర్మానంలో కోరారు. పంట నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశుసంపద పరిరక్షణ, భూగర్భ జలాలు, చెరువుల పునరుద్ధరణకు సాయం అందించాలని కోరారు. VB-G RAM G కింద 125 రోజులకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి, లేబర్ బడ్జెట్ పెంపు, 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ సడలింపును కోరారు

ఎరువులను సకాలంలో కేటాయించి ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్‌ల ద్వారా పంపాలని, PDMC కేటాయింపులు పెంచి డ్రిప్ ఇరిగేషన్ విస్తరించాలని కోరారు. MIDH కింద కూరగాయల సాగుకు ఆర్థిక సాయం, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్తు, 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీతో పాటు రేక్‌ల లభ్యత పెంచి ట్రాన్స్‌మిషన్ ఛార్జీలను సడలించాలని కోరారు.

తాగు, సాగునీరు, కరువు నివారణ చర్యలకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవనానికి కేంద్ర పథకాల కింద సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2026-27లో FRBM రుణ పరిమితిని GSDPలో 3 నుంచి 3.5 శాతానికి పెంచడంతో పాటు రైతులు, బలహీన వర్గాల కోసం కేంద్ర, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించి అవసరమైన నిబంధనలను సడలించాలని తీర్మానంలో కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు