గాడే సాయికృష్ణ మృతి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు…

• సాయికృష్ణ పోలీసుల దెబ్బలతోనే మృతి సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.

•కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులను విచారించిన అనంతరం పోలీసుల దెబ్బల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

•సాయికృష్ణ మృతదేహాన్ని ఏ4 సురేష్, సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి దహనం చేసి మాయం చేసినట్లు సంబంధిత తేదీలతో సహా కోర్టుకు సిట్ నివేదించింది.

•మృతదేహంతో పాటు ఆధారాలను ధ్వంసం చేశారని, సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు దొరక్కుండా నిందితులు జాగ్రత్తపడ్డారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.

గాడే సాయికృష్ణ మృతి కేసులో A-4 గులివిందల సురేష్ సెప్టెంబర్ 17న విజయవాడ SIT కార్యాలయంలో లొంగిపోయినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అప్పటివరకు అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మే 12న రాణిగారి తోట సమీపంలోని ఖాళీ భవనంలో సాయికృష్ణను తీవ్రంగా నీరసించిన స్థితిలో చూసినట్లు సురేష్ వెల్లడించాడని రిపోర్టులో ఉంది. తనపై రోజూ దాడి చేస్తున్నారని సాయికృష్ణ చెప్పినట్లు, కొద్దిసేపటికే స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

సాయికృష్ణ మృతి విషయం A-1కు తెలియజేయగా మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా స్వర్గపురి శ్మశానవాటికలో కాల్చివేయాలని ఆదేశించినట్లు A-4 వెల్లడించాడని రిపోర్టులో ఉంది. A-2, A-3 మృతదేహాన్ని బైక్‌పై తరలించగా.. A-4 మరో బైక్‌పై వారిని అనుసరించినట్లు పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే మృతదేహం పూర్తిగా కాలిపోయిందా.. అవశేషాలు ఏమైనా మిగిలాయా అని తెలుసుకునేందుకు మే 18న మరోసారి స్వర్గపురికి వెళ్లినట్లు రిపోర్టులో పొందు పరిచారు . సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నంలో సాయికృష్ణకు సంబంధించిన రెండు ఫొటోలను మొబైల్ నుంచి డిలీట్ చేసినట్లు A-4 వెల్లడించాడని పోలీసులు పేర్కొన్నారు.

సాయికృష్ణ కుటుంబంతో రాజీకి ప్రయత్నించినట్లు రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, రాజీకి ఎంత పరిహారం కావాలని మృతుడి మేనమామను A-4 అడిగినట్లు పేర్కొన్నారు.

కేసు నమోదైన తర్వాత అరెస్ట్ తప్పించుకునేందుకు A-2, A-3తో కలిసి హైదరాబాద్, నాగ్‌పూర్ వెళ్లినట్లు A-4 వెల్లడించాడని రిపోర్టులో ఉంది. పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు మొబైల్‌ను కాలువలో పడేసినట్లు పేర్కొన్నారు. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం తదితర ఆరోపణలపై దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు