ముఖ్యమంత్రి కి లేఖ రాసిన కల్వకుంట్ల కవిత
దగా పడ్డ తెలంగాణలో వెలుగులు నింపేందుకు,స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేందుకు ఒక మార్గ దర్శకుడుగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహం లేక పోవటం బాధాకరమని అభిప్రాయ పడ్డారు తెలంగాణ రక్షణ సేన అధినాయకురాలు కల్వకుంట్ల కవిత.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి తుదికంటా తండ్లాడిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్అని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో అధికారికంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం దురదృష్టకరం అని తెలంగాణ జాగృతి సంస్థ పేరిట లేఖలో పేర్కొన్నారు కవిత. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరం కాబట్టి ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని కోరుతున్నామన్నారు కవిత..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో విగ్రహ ప్రాంగణం గ్రీనరీ నిర్వహణ కూడా తమ సంస్థ పక్షాన చూస్తామన్నారు. జయశంకర్ సార్ జయంతి అయిన ఆగస్ట్ 6 నాటికి విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని లేఖలో ప్రస్తావించారు కవిత…









