పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :.భద్రాచలం ఏప్రిల్ 15 : టుడే 9 ప్రతినిధి

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయ మాడవీధుల విస్తరణ పనులను ఆగమ శాస్త్ర ప్రకారం భక్తులకు విశాలవంతంగా ఉండేలా వచ్చే గోదావరి పుష్కరాల నాటికి రీ మోడలింగ్ చేసి పూర్తిస్థాయిలో పనులు వేగవంతం చేసి గోదావరి పుష్కరాల నాటికి యుద్ధపాతిపదికన పూర్తయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
బుధవారం నాడు సాయంత్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి మాడవీధుల డిజైనింగ్ పనులను ఆర్కిటెక్ బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో భక్త రామదాసు నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవస్థానం గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల భక్తులకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదని,కాగా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అభివృద్ధికై 351 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేసి శ్రీరామనవమి రోజు శంకుస్థాపన చేసి మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.

మాడవీధుల నిర్మాణానికి ఒక ఎకరం 28 గుంటల భూమిని సేకరించడం జరిగిందని, భక్త రామదాసు కట్టించిన కట్టడాలకు ఇబ్బందులు లేకుండా రాములవారి ఆలయాన్ని ఆగమ శాస్త్ర ప్రకారము నిష్ణాతులైన శిల్పులతో ఆద్యంతం శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. దేవస్థానం రీ మోడలింగ్ చేయడానికి ప్రధానంగా ఆర్కిటిక్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అర్చకులు పూర్తిగా పరిశీలించి దానికి కావలసిన అన్ని రకాల మెటీరియల్ తెప్పించి గోదావరి పుష్కరాల నాటికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన పనులను పూర్తిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా డిజైన్ చేస్తున్నామని అన్నారు.


అనంతరం దేవస్థానం ప్రాంగణంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పనులు మాత్రం శాస్త్రోక్తం గా జరపాలని, భక్తులకు విశాలవంతంగా ఉండేలా మాడవీధులలో ఫుట్ పాత్ర్ లు ఏర్పాటు చేయాలని, డిజైన్ పూర్తి స్థాయిలో కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి రాతి మెటల్ మెటల్ ఉపయోగించి కట్టడాలు నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భక్త రామదాసు కట్టించిన దానికి పవిత్రతకు భంగం కలగకుండా నిర్మాణాలు చేపట్టి, ప్రతి చోటా వెంటిలేషన్ దెబ్బతినకుండా చూడాలని ఆదేశించారు గోదావరి పుష్కరాల గడువు దగ్గర పడుతున్నందున గురువారం నుండి 24 గంటలు మాడవీధుల విస్తరణ పనుల మీదనే దృష్టి సారించాలని, మాడవీధుల విస్తరణకు సంబంధించిన టెండర్ల పనులు పూర్తి కావాలని, అవసరమైతే ఆర్కిటిక్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం పూర్తిస్థాయిలో మాడవీధుల విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూణెం కృష్ణ దొర, ఆర్కిటెక్ డిజైనర్ సూర్యనారాయణ బృందం మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share