పోలీసుల ఎదుటే రావణ్ పై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించిన జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
కొత్తగూడెం అర్బన్, జులై 05 (TODAY9) :
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించినందుకు యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉ.పా.చట్టం నమోదు చేసి పైశాచిక ఆనందం పొందుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేష్ ఆరోపించారు.
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రశ్న రావణ్ ను ఒక కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారని, ప్రశ్న రావణ్ పై ఇప్పటివరకు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట నాలుగు రోజుల్లో నాలుగు పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేసి నాలుగు కోర్టుల్లో హాజరు పరచగా బెయిలు మంజూరు చేయడం జరిగిందని, ప్రశ్న రావణ్ తరఫున జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ నాలుగు రోజులు నలుగురు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించి బెయిలు మంజూరు అయ్యేలా చేశారని, నిన్న మళ్ళీ బెయిలు మంజూరు అయిన తర్వాత ప్రశ్న రావణ్ పై ఎన్ని కేసులు నమోదు చేసినా శ్రావణ్ కుమార్ బెయిల్ తీసుకొస్తాడని దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఉ.పా. చట్టం నమోదు చేశారని, ఇది సరైంది కాదని విమర్శించారు.
ప్రశ్న రావణ్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో మరియు కోర్టుకు తరలిస్తున్న సమయంలో జనసేన మూకలు వందలాదిమంది రావణ్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది అప్రజాస్వామికమన్నారు. ప్రశ్న రావణ్ కు ఏమి జరిగినా కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, వెంటనే రావణ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంధం మల్లికార్జున రావు, నాగుల రవికుమార్, తుమ్మ వంశీ, గజ్జల శంకర్ తదితరులు పాల్గొన్నారు.









