కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలి.. వద్దిరాజు

విమానాశ్రయం నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర


కొత్తగూడెం : జూలై 05 ( TODAY9):

కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ముందడుగు పడడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి గతంలో ఆయన పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ఒక శంషాబాద్ నుంచి మాత్రమే విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి కొత్తగూడెం సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం, సింగరేణి బొగ్గు గనులు విస్తారంగా నెలకొనడం, భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి కొలువైన ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గురించి ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో లేవనెత్తడం, కేంద్ర ప్రభుత్వానికి, పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడుకు నివేదించడం విదితమే. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలమైన స్థలం ఎంపిక బాధ్యతను “రాజ్ టెక్నాలజీస్”కు కేంద్ర ప్రభుత్వం అప్పగించడం ఆనందదాయకం. .గతంలో పాల్వంచ, దాని చుట్టుపక్కల పలు చోట్ల సర్వే జరిగినా విమానాల రాకపోకలకు అనువైన స్థలాన్ని గుర్తించడం జరుగలేదు. తాజాగా “రాజ్ టెక్నాలజీస్” సంస్థ క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి జిల్లా కేంద్రం సమీపాన ఉన్న సుజాతానగర్-సీతంపేట పరిసరాలు అనుకూలమైనవని నిర్థారించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు స్పందించి హర్షం వ్యక్తం చేస్తూ, హృదయపూర్వకంగా స్వాగతించారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తాను తెచ్చిన అంశాలను ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్న ప్రధాన గమ్యస్థానం అని చెప్పారు. “దక్షిణ గంగా” నదిగా పిలుచుకునే గోదావరి ని “దక్షిణ అయోధ్య”గా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కొలువైన దివ్యక్షేత్రాన్ని, పర్ణశాలను ప్రతినిత్యం వేలాది మంది భక్తులు సందర్శించడం, సింగరేణి బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయని, జిల్లా కేంద్రం కొత్తగూడెంలో దాని ప్రధాన కార్యాలయం నెలకొని ఉందన్నారు. అలాగే, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, నవభారత్, ఐటీసీ, కేటీపీఎస్, బీపీటీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉండడం తదితర అంశాలను ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు. ఈ సానుకూలమైన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరుతో పాటుగా మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల పనులను మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి రాంమోహన్ నాయుడును ఆయన కోరారు.

అదే విధంగా ఖమ్మం-కొత్తగూడెం-పాల్వంచ-భద్రాచలం రోడ్డును ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్, మరోవైపు ఒడిషాలోని మల్కన్ గిరి వరకు 4 లైన్లుగా విస్తరించాలని, కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఏర్పాటై 2032 నాటికి 100 ఏండ్లు పూర్తి కావస్తుండడంతో డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ భద్రాచలం మీదుగా ఛత్తీస్ ఘడ్, ఒడిషాల వరకు మార్గాన్ని పొడగించాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల నగర పాలక సంస్థగా అవతరించిన కొత్తగూడెం రోడ్డు విస్తరణ, రైల్వే డివిజన్ ఏర్పాటు, రైల్వే మార్గం పొడిగింపు, విమానాశ్రయం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలలోని సరిహద్దు జిల్లాలకు ముఖ్యమైన గమ్యస్థానమై ఆథ్యాత్మికంగా,వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ వద్దిరాజు ఆశాభావం వ్యక్తంచేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు