టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు
భద్రాచలం జూన్ 14 : TODAY 9 ప్రతినిధి
విద్యారంగానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడం పాఠశాలలో కనీస వసతి సౌకర్యాలు కల్పించకపోవడం తగినంత మంది ఉపాధ్యాయులను సరైన సమయంలో నియమించకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అందుకు కారణమని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు అన్నారు.
టిపిటిఎఫ్ భద్రాచలం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు పాయం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన భద్రాచలం ప్రాంత బాధ్యుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ… పాలకులు మారినప్పుడల్లా తమకు అనుకూలమైన రీతిలో విద్యారంగాన్ని అనేక తిరోగమన మార్పులకు గురిచేస్తూ పేద బలహీన వర్గాల బాలబాలికలకు విద్యను దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. విద్యను సరుకుగా, వ్యాపార రంగంగా మార్చారని అన్నారు.
విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని మూతబడిన ఆరు వేల పాఠశాలలను తెరిపిస్తామని ప్రతి ఆవాస ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పుతామని ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని ఒక పత్రిక చర్చ కార్యక్రమంలో ప్రకటించడానికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలల నుండి కార్పొరేట్, నేషనల్ ఇంటర్నేషనల్ పాఠశాలల ఏర్పాటుకు ఇతోధికంగా ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని, వీటిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలక వర్గాల నాయకులకు వాటాలు ఉన్నాయని అన్నారు.
విద్య వైద్య రంగాలకు ఖర్చు తప్ప ఆదాయం రాదని కేంద్ర రాష్ట్ర పాలకులు వీటిని వదిలించుకోవాలని చూస్తున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని పాఠశాలలను మేధావుల ప్రజల మీడియా వారి సహకారంతో మనమే రక్షించుకునే పోరాటాలలో భాగం పంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు తాటి సత్తిబాబు, పాయం కృష్ణయ్య, రాష్ట్ర మాజీ కార్యదర్శి మునిగడప రామాచారి, వివిధ మండలాల బాధ్యులు బి.ప్రకాష్ రావు, వి.ముత్తయ్య, బి.రవి తదితరులు పాల్గొన్నారు.









