దుమ్ముగూడెం మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులందరూ నాణ్యమైన విద్యను అందుకుని ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని, పిల్లల భవిష్యత్తుకు ఈ స్కూల్ దోహదపడుతుందని అన్నారు.
శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వెనుక భాగంలో స్కూల్ డిజైన్‌లకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు.

ఈ స్కూల్ ఏర్పాటుతో దుమ్ముగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది.
మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన మంత్రి
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా పథకం కింద నిర్మించనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులతో ఈ విద్యాసంస్థ నిర్మించబడుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.









