ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. : చర్ల మే 5 : టుడే 9 ప్రతినిధి

చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం నష్టపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ట్యాబ్ ఎంట్రీలను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.

అనంతరం సత్యనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కాకర్లపూడి విజయలక్ష్మి పూర్తి చేసిన ఇల్లు, చినిగిరి రాజు రూఫ్ స్థాయిలో ఉన్న ఇల్లు, కారం నాగరాజు స్లాబ్ దశలో ఉన్న ఇల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పునాది నుంచి స్లాబ్ వరకు ప్రతి దశలో ఇంజనీరింగ్ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.

నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష నిర్వహిస్తూ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిమెంట్, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి నాణ్యంగా ఉండేలా చూడాలని, పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామంలో మంజూరైన 27 ఇళ్లలో 25 ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతుండగా, మిగిలిన ఇళ్లకు గ్రౌండింగ్ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే లక్ష్యమని, పనులు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంటగది, అవుట్ పేషెంట్ విభాగం తదితర విభాగాలను సందర్శించి సేవల నాణ్యతను తనిఖీ చేశారు.

ఓపీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందుల నిల్వలను పరిశీలించి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్టాక్ నిర్వహణను క్రమబద్ధీకరించాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై దృష్టి సారిస్తూ శుభ్రతతో కూడిన పోషకాహారం అందించాలన్నారు.

ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడి అత్యవసర సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకుని, సమయానికి స్పందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రిలో త్రాగునీటి కొరత ఉన్నట్లు గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిరంతర నీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, శుభ్రత, మౌలిక సదుపాయాలు అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏ ఈ ముకేశ్ ,ఏ ఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈ లు అరుణ్,రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ సాయి వర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు