భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :భద్రాచలం: ఏప్రిల్ 22: టుడే 9 ప్రతినిధి
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలల పనితీరు పర్యవేక్షణ చేస్తున్న ఎస్ సి ఇ ఆర్ పిలు ఈ విద్యా సంవత్సరం ముగుస్తున్నందున ఇంతవరకు పాఠశాలల పనితీరు గురించి కులంకషంగా చర్చించడం జరిగిందని ఏ సి ఎం ఓ రమేష్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని పీఎంఆర్సి భవనంలోని సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్సీఈఆర్పి లతో ఈ విద్యా సంవత్సరంలో చేపట్టవలసిన కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా జిపిఎస్ పాఠశాలల పర్యవేక్షణ పగడ్బందీగా ఉండాలని ముఖ్యంగా జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను గుర్తించాలని, బడిబాట కార్యక్రమంలో అట్టి పాఠశాల విద్యార్థులు వచ్చే విధంగా తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీస అవసరాలను గుర్తించాలని, ఉపాధ్యాయులకి వేసవి సెలవుల్లో శిక్షణ కార్యక్రమాల గురించి చర్చించాలని,ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనితీరు మెరుగుపరుచుకోవడానికి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉద్దీపకం ప్రోగ్రాం కాంప్లెక్స్ సమావేశాన్ని ఏ విధంగా నిర్వహించాలో ప్రణాళికలు రూపొందించుకోవాలని,స్కూల్ గ్రాంట్స్ స్పోర్ట్స్ గ్రాంట్స్ ను ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలో సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి నిధులు వృధా కాకుండా చూడాలని అన్నారు.

భవిష్యత్తులో ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాలల యొక్క పనితీరును మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు గురించి కులంకషంగా చర్చించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాల వివరాలు సేకరించి అధికారులకు నివేదికలు పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారి గోపాలరావు గిరిజన సంక్షేమ శాఖ ఎస్ సి ఇ ఆర్ పి లు, పి ఎమ్ ఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









