కూలి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి బంగారం లాక్కుని మహిళను బావిలో తోసేసిన దుండగుడు…
21 గంటలు బావిలోనే ఉండి, ప్రాణాలతో బయటపడ్డ మహిళ…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ గంగాధర లక్ష్మీ(55) అనే మహిళ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే లక్ష్మీని ఆమె కొడుకు సందీప్ కూలి అడ్డ వద్ద దిగబెట్టాడు.ఇంతలో గుర్తు తెలియని వ్యక్తిఒకరు కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకుని, నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి, ఉదయం 11 గంటల సమయంలో ఆమె వద్ద ఉన్న అర తులం బంగారం, 4వేల నగదు లాక్కుని ఆమెను బావిలో తోసేశాడు. గంగాధర లక్ష్మి బావిలో ఉన్న తాడు పట్టుకుని పైకి రావడం గమనించి, తాడును కోసేసిన గుర్తు తెలియని వ్యక్తి వెళ్ళిపోయాడు.
బావిలో ఈదుకుంటూ, మోటారుకున్న పైపును పట్టుకున్న బాధితురాలు తన ప్రాణాలు కాపాడుకుంది. కాగా రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో, బాధితురాలి కొడుకు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నుస్తులాపూర్ గ్రామం అంతా గాలించినా మహిళ ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బావి దగ్గరికి వెళ్ళిన భూ యజమానికి కేకలు వినపడడంతో తొంగి చూసి, లోపల మహిళ ఉందని సమాచారం ఇవ్వడంతో ,గ్రామస్తులు ఆమెను బయటికి తీశారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.









