సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి లభించింది. ఒక బాలుడు రైల్వే స్టేషన్ లో దారి మర్చిపోయి తిరుగుతూ ఇంతలో తనకు కనిపించిన వ్యక్తిని డాడీ అని పిలిచినందుకు గత 12 రోజులుగా తనవద్దనే దాచిపెట్టిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తన కొడుకు నిఖిల్(5), తల్లి స్వరూపతో కలిసి ఉప్పల్ చిలకనగర్ ప్రాంతంలో రాపు రాజేశ్వరి అనే మహిళ నివసిస్తున్నారు.గత నెల 20వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో స్వరూప తన మనవడిని తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో, ప్లాట్ ఫామ్ నంబర్ 1పై విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా నిఖిల్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన స్వరూప ఇంటికి వచ్చి తన కూతురుకి విషయం చెప్పిగా, గత నెల 21వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు… గత 12 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా.. ఏపీ రాజోలుకు చెందిన షేక్ మహమ్మద్ అలీ అనే వ్యక్తి నిఖిల్ ను పోలీస్ స్టేషన్లో అప్పగించటంతో కథ సుఖాంతం అయింది…

ఉప్పల్ చిలకనగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ తన అమ్మమ్మతో కలిసి విజయవాడ వెళ్లేందుకు నిఖిల్(5) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు.ఇంతలో అమ్మమ్మకు చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు చింతల్ రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉండే ఏపీ రాజోలుకు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే వ్యక్తిని డాడీ అని పిలిచాడు.తనతో విభేదాల కారణంగా తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోగా, నిఖిల్‌ను షేక్ అహ్మద్ అలీ తనతో తీసుకెళ్లి పెంచుకుందామని భావించాడు.ఇలా 12 రోజులు బాలుడిని ఇంట్లో దాచిపెట్టిన క్రమంలో , కిడ్నాప్ వార్తలు ఎక్కువగా రావడంతో భయపడిన నిందితుడు బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి, బాబుకి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశానని షేక్ అహ్మద్ అలీ పోలీసులకు వివరించాడు.కాగా నిందితుడిపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు బాలుడిని తల్లికి అప్పగించటంతో తల్లి ఆనందం వ్యక్తం చేశారు.









