- APAIMS 2.0తో అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్
- అక్రమాల దారులు మూసుకుపోవడంతోనే అసత్య ప్రచారం, పారదర్శక వ్యవస్థను చూసి కొందరిలో అసహనం
- నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా, సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుంచి కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో APAIMS 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ చేపట్టామని మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ విజయవంతంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. దీనివల్ల అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు అందేలా పూర్తి భరోసా కల్పించామని మంత్రి పేర్కొన్నారు.
రైతు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిమాణంలోనే ఎరువులు అందజేస్తున్నామని తెలిపారు. దీంతో సమతుల్య ఎరువుల వినియోగం పెరిగి, రైతులకు దిగుబడులు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా సక్రమంగా వినియోగమవుతుందని చెప్పారు. APAIMS 2.0 ద్వారా ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, మళ్లింపులు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం లభించిందన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా రియల్‌టైమ్ పర్యవేక్షణ సాధ్యమవుతోందని, iFMS, APAIMS, భౌతిక నిల్వల సమన్వయంతో ఖచ్చితమైన నిల్వల నిర్వహణ జరుగుతోందని వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా, అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశాలు కల్పించేలా ఈ వ్యవస్థ రూపొందించబడిందని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 155251 కు కాల్ చేయవచ్చని మంత్రి తెలిపారు.
రైతులు తమ ఎరువుల కొనుగోలు చరిత్ర, అర్హత వివరాలను కూడా సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించామని, రైతు-కేంద్రీకృత, పారదర్శక, సాంకేతికత ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థగా APAIMS 2.0 వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏ నిజమైన రైతుకూ ఎరువు నిరాకరించబడకూడదు… ఏ అనధికార వ్యక్తి లేదా రైతు కాని వ్యక్తికి సబ్సిడీ ఎరువు అందకూడదు అన్నదే APAIMS 2.0 మార్గదర్శక సూత్రమని మంత్రి స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రారంభ దశలో కొద్దిపాటి సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిలో అధిక భాగం ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు OTP లేదా సర్వర్‌కు సంబంధించిన తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నా, ప్రత్యేక సాంకేతిక బృందాలు 24×7 పర్యవేక్షణ చేస్తూ వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం APAIMS 2.0 పూర్తిస్థాయిలో సజావుగా పనిచేస్తూ రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎరువుల పంపిణీ కొనసాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాల వంటి అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికే APAIMS 2.0 వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ పారదర్శక విధానం అమలులోకి రావడంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, దీంతో కొందరి స్వార్థ ప్రయోజనాలకు గండిపడిందని పేర్కొన్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు అనుకూలంగా ఉన్న పత్రిక ద్వారా రైతులను మభ్యపెట్టేలా నిరాధార కథనాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో తనకు అనుకూలమైన కొందరు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా యూరియా, డీఏపీ వంటి సబ్సిడీ ఎరువులను అక్రమంగా మళ్లించే అవకాశం ఉండేదని, ఇప్పుడు APAIMS 2.0 వల్ల అలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడిందన్నారు. సాక్షి పత్రిక వాస్తవాలను పూర్తిగా విస్మరించి నిరాధార కథనాలను ప్రచురించడం బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధం. క్షేత్రస్థాయి వాస్తవాలు, అధికారిక గణాంకాలు, సంబంధిత వివరాలను ధృవీకరించిన తర్వాతే వార్తలు ప్రచురించాలి. పత్రిక యజమాని జగన్ రెడ్డి చెప్పగానే అసత్య కథనాలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడవు. నిజాలను తెలుసుకుని, వాస్తవాలను ప్రతిబింబించేలా బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాలను రైతులు విశ్వసించరని, పారదర్శక పాలనతో నిజమైన రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
టమాటా ధరలపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
రాష్ట్రంలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయంటూ, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నమోదవుతున్న అధికారిక ధరలను పరిశీలిస్తే టమాటా ధరలు స్థిరంగానే ఉన్నాయని తెలుస్తోందన్నారు. ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీలో జూన్ 25న 10 కిలోల టమాటా కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.210, మోడల్ ధర రూ.180 నమోదైందన్నారు. అలాగే గుర్రంకొండ సబ్ మార్కెట్ యార్డులో 10 కిలోల టమాటా కనిష్ఠ ధర రూ.112, గరిష్ఠ ధర రూ.192, మోడల్ ధర రూ.152 నమోదైందని తెలిపారు. ఈ అధికారిక గణాంకాలే మార్కెట్లోని వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం వల్ల రైతుల్లో అనవసర ఆందోళన నెలకొనడమే కాకుండా మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో ఉన్న జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌కు సంబంధించి వస్తున్న ప్రచారంపై కూడా మంత్రి స్పందించారు. రెండు యూనిట్లలో ఒకటి నిరంతరంగా పనిచేస్తుండగా, మరో యూనిట్లో బాయిలింగ్ విభాగంలో ఏర్పడిన సాంకేతిక సమస్యను రెండు రోజుల వ్యవధిలోనే పరిష్కరించి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందన్నారు. యూనిట్ అనేక రోజులుగా నిలిచిపోయిందన్న ప్రచారం నిజం కాదని, ప్రస్తుతం మామిడి పండ్ల అన్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, నిరాధార ప్రచారాలను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.









