భద్రాచలం : జూన్ 10 : TODAY 9 ప్రతినిధి..
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ వరుసగా 4399 రోజులపాటు దేశానికి నాయకత్వం వహిస్తూ భారత రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ నాయకులు స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, 4 కోట్లకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం, 15 కోట్లకు పైగా ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు, 10 కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 55 కోట్లకు పైగా జనధన్ బ్యాంకు ఖాతాలు, 11 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 14 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు సామాన్య ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం, జీ-20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలవడం, రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు, రైల్వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించడం మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు.

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం, గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించడం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు మోదీ నాయకత్వంలో అమలయ్యాయని తెలిపారు.
ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచుతూ, 2047 నాటికి “వికసిత భారత్” లక్ష్య సాధన దిశగా మోదీ గారు కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరింత కాలం దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు కురిచేటి రామచంద్రమూర్తి, జిల్లా కౌన్సిల్ సభ్యులు నిడదవోలు నాగబాబు, జిల్లా సీనియర్ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, బోడ సత్యనారాయణ, చెల్లుబోయిన వెంకన్న, ముత్యాల చంద్రశేఖర్, పీసీ కేశవ్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడి వెంకట సుబ్బయ్య, జీవా తదితరులు పాల్గొన్నారు.









