నేను కవితను కలవలేదు..తామిద్దరం భేటీ అయ్యామని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపడేశారు రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్. ఇది ఇలా ఉంటే సంక్రాంతి సమయంలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి, రెండు సార్లు కవితను కలిసి, పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు కవిత అనుచరులు..మీడియాకు లీకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అ అవటం, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఆమె బయటకు వచ్చిన తరువాత బి ఆర్ ఎస్ పార్టీలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పైన, అన్న కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేసిన కవిత పార్టీకి దూరమైన తరువాత స్వంత పార్టీని నెలకొల్పబోతుందని పార్టీ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ నడుస్తూనే ఉంది. పార్టీ తరఫునుండి ఎన్నికైన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజలు ఊహించినట్టు కవిత సొంత పార్టీ పెట్టబోతున్నారనే అనుమానాలు నిజం కాబోతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఈ దిశగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలను తీసుకుని ముందుకు సాగనున్నారనే పుకార్లు సైతం రాజకీయ వర్గాల్లో షికారు చేశాయి. గత కొద్ది రోజుల క్రితం సంక్రాంతి నాడు ప్రశాంత్ కిషోర్ హైదరాబాదుకు వచ్చారని కవితను కలిశారని వార్తలు సైతం వచ్చాయి. ఈ విషయమై ప్రశాంత్ కిషోర్ ను మీడియా ప్రశ్నించగా,ఆ లీకుల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం ఊహాజనితమైన, నిరాధారమైన వార్తలుగా కొట్టి పారేశారు ప్రశాంత్ కిషోర్.








