నియాస్ (NIOS) లేదా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్, డిగ్రీ చదివిన వారికి న్యాయవాదులుగా ఎన్‌రోల్‌మెంట్ నిరాకరణ.

తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయంపై తీవ్ర గందరగోళం…

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా ఓపెన్ యూనివర్సిటీ/దూర విద్యా విధానంలో డిగ్రీ చదివి, ఆపై లా కోర్సులు పూర్తి చేసిన లా గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా నమోదు (ఎన్‌రోల్‌మెంట్) చేసుకోవడానికి తెలంగాణ బార్ కౌన్సిల్ (BCT) నిరాకరిస్తోంది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిబంధనల ప్రకారం ఇటువంటి విద్యార్థులు అర్హులే అయినప్పటికీ, స్థానిక బార్ కౌన్సిల్ అభ్యర్థనలను పక్కన పెట్టడంతో దాదాపు 80 మందికి పైగా లా గ్రాడ్యుయేట్లు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉంటే కోర్టులను ఆశ్రయించిన కొద్దిమందికి మాత్రమే తాత్కాలిక ఉపశమనం లభిస్తుండగా, మిగిలిన వారి దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. 2021లో తెలంగాణ హైకోర్టు ‘ఎం. నవీన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ’ కేసులో ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని తెలంగాణ బార్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆనాటి కేసులో ‘సింగిల్ సిట్టింగ్’ (10+2+3 పద్ధతిని అనుసరించకుండా నేరుగా రాసే పరీక్షలు) ద్వారా పొందిన డిగ్రీ చెల్లదని కోర్టు పేర్కొంది. కానీ, నియాస్ (NIOS) ద్వారా నిబంధనల ప్రకారం పదో తరగతి పాసైన తర్వాతే ఇంటర్ చేసిన వారిని, లేదా గుర్తింపు పొందిన ఓపెన్ యూనివర్సిటీల (ఉదాహరణకు ఇగ్నో – IGNOU) ద్వారా క్రమపద్ధతిలో డిగ్రీ పూర్తి చేసిన వారిని కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ఒకే గాటన కట్టడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్, 2008 లోని రూల్ 5(a), 5(b) ప్రకారం కరస్పాండెన్స్ లేదా ఓపెన్ స్కూలింగ్ పద్ధతిలో అర్హతలు సాధించిన వారు న్యాయశాస్త్ర కోర్సులకు అర్హులే. కేవలం ఎలాంటి ప్రాథమిక విద్య లేకుండా, నేరుగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు పొందిన వారిని మాత్రమే మినహాయించారు. 2017లో బి.సి.ఐ స్పష్టమైన వివరణ ఇస్తూ.. 10వ తరగతి, ఇంటర్మీడియట్, లేదా డిగ్రీలను ఏ విధానంలో (దూర విద్యా లేదా ఓపెన్ స్కూలింగ్) పూర్తి చేసినా వారు ఎన్‌రోల్‌మెంట్‌కు అర్హులేనని స్పష్టం చేసింది.

అయినప్పటికీ, తెలంగాణ బార్ కౌన్సిల్ తమ చేతులు కట్టేసి ఉన్నాయని, అభ్యర్థులు కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటేనే ఎన్‌రోల్‌మెంట్ చేస్తామని పట్టుబడుతోంది. ఈ వివక్షపై ఇప్పటికే పలువురు బాధితులు కోర్టులను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల జోక్యంతో శశాంక రెడ్డితో పాటు మరో నలుగురు అభ్యర్థులను తెలంగాణ బార్ కౌన్సిల్ ఇటీవల ఎన్‌రోల్ చేసుకుంది.

నియాస్ ద్వారా ఇంటర్ పూర్తి చేసి 5 సంవత్సరాల లా కోర్స్ చదివిన ఎం. నవనీత్ చౌదరి కేసును హైకోర్టు సింగిల్ జడ్జి.. విస్తృత ధర్మాసనానికి (డివిజన్ బెంచ్) బదిలీ చేశారు. మద్రాస్, కర్ణాటక హైకోర్టులు నియాస్ విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ జూలై 13న ఈ అంశంపై కీలక విచారణ జరపనుంది.

లా కోర్సుల్లో చేరకముందే నియాస్ విద్యార్థుల అర్హతపై బార్ కౌన్సిల్ స్పష్టత ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ దూర విద్యా విధానంలో చదివిన వారు న్యాయవాద వృత్తికి అనర్హులైతే, లా కాలేజీలు వారికి ఎందుకు అడ్మిషన్లు ఇస్తున్నాయి? యూనివర్సిటీలు ఫీజులు వసూలు చేసి డిగ్రీలు ఎందుకు ప్రధానం చేస్తున్నాయి? అని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. దీనిపై కేంద్ర న్యాయశాఖ కూడా జోక్యం చేసుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఈ గందరగోళానికి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించకపోతే, వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share