డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బీజేపీ క్యాడర్ .

భద్రాచలం, జూన్ 23 : TODAY 9.ప్రతినిధి

డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా భద్రాచలం భగవాన్ దాస్ కాలనీలోని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా మాట్లాడుతూ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాద భావజాలానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ విభజన సమయంలో మొత్తం బెంగాల్‌ను పాకిస్తాన్‌లో కలపాలన్న ప్రయత్నాలను అడ్డుకొని, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో కొనసాగేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర మంత్రిగా సేవలందించిన ఆయన, దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పారని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ “ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేగా” అనే నినాదంతో ఉద్యమించిన డాక్టర్ ముఖర్జీ, దేశ సమగ్రత కోసం తన జీవితాన్నే అర్పించారని కుంజా ధర్మా అన్నారు. 1953 జూన్ 23న కాశ్మీర్‌లో నిర్బంధంలో ఉండగానే ఆయన అమరుడయ్యారని, నేడు దేశవ్యాప్తంగా ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నామని తెలిపారు. భారతదేశ ఏకత్వం, అఖండత కోసం ఆయన చూపిన మార్గం నేటికీ దేశభక్తులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో *బీజేపీ మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, బీజేపీ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల చంద్రశేఖర్, ఆవుల సుబ్బారావు, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, షేర్ శ్రీను, జంపాల ప్రభాకర్, జి. వెంకటేశ్వర్లు (జీవా), కనసాని శ్రీనివాస్, జి. కేశవరావు, రంగులగుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share