*ఐద్వా పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి.
*చిన్నారిపై అత్యాచారం ఘటనపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. భద్రాచలం జూన్ 13 : TODAY 9 ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన కామాంధుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకురాలు నాదెండ్ల లీలావతి అధ్యక్షతన జరిగిన సభలో డి సీతాలక్ష్మి మాట్లాడారు. ముక్కుపచ్చలారని చిన్నారి వేసవి సెలవుల నేపథ్యంలో తన తాత వద్ద గడిపేందుకు వచ్చిందని అన్నారు. అటువంటి చిన్నారిపై అగత్యానికి పాల్పడ్డ వ్యక్తి తన రాక్షసత్వాన్ని చూసి భయపడి కేకలు వేసిన చిన్నారిని ఐదంతస్తుల డాబా పై నుండి తోసేసి చంపాలని ప్రయత్నించాడని అన్నారు. వెంటనే స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని ఇప్పటికీ తన ఆరోగ్యం విషమంగానే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం ప్రాంతంలోనే ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వానికి అవమానమని అన్నారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు అభినందినీయులని ఇదే స్ఫూర్తితో వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించేలా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో మనువాదుల పాలన ప్రారంభమైన నాటి నుండి ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని సీతా లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో ఉత్తర ప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలలో జరిగే మానవీయ ఘటనలు ఇప్పుడు మన కళ్ళముందే జరుగుతున్నాయని అన్నారు. ఆడపిల్లలకు తమ స్వయ రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. మానసిక ధైర్యం పెంపొందించుకునేందుకు సెమినర్లు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జీవనజ్యోతి ఎర్రంశెట్టి పూర్ణిమ పుస్తెల జ్యోతి ఎం సుబ్బలక్ష్మి కొత్త సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు









